TG Paddy Procurement : ఆర్భాటంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం... కొనడంలో ఆలస్యం..! ఆందోళనలో అన్నదాతలు
Paddy Procurement in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి పక్షం రోజులైన… ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే అదునుగా మిల్లర్స్ రంగంలోకి దిగి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
ఆరుగాలం శ్రమించే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతికందిన పంట వరి ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షంరోజులు అవుతున్నా ఎక్కడ ధాన్యం కొనుగోలు జరగక కళ్ళాల్లో పడిగాపులు కాస్తున్నారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిసి ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేని ధోరణితో రైతన్నలు రోడ్డెక్కే దుస్థితి ఏర్పడింది. మిల్లు అలాట్మెంట్ లేకపోవడంతో కొనుగోలు చేయడం లేదని ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మిల్లర్స్ మాత్రం లోపాయికారి ఒప్పందంతో తక్కువ ధరకు రైతులను నుంచి నేరుగా ధాన్యం కొంటూ అన్నదాతలను నిలువునా మంచుతున్నారు.
ఆర్భాటంగా ప్రారంభం...కొనడంలో ఆలస్యం…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలంలో 11.75 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 20.59 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1360 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్ క్వింటాలు ధాన్యానికి రూ.2320, కామన్ రకానికి రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర అందిస్తోంది. అయితే సన్నరకం ధాన్యానికి తర్వాత అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అన్ని కేంద్రాలను అధికారులు పాలకులు ఆర్బాటంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎక్కడ ఒక బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదు. పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకునేందుకు అన్నదాతల పాట్లు మరో ఎత్తుగా మారింది. సాగు మొదలుకుని చీడపీడలు, అకాల వర్షాలతో దిగుబడులపై ప్రభావం.. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డ రైతులు పంట అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ధాన్యం ఎండి కాంట పెట్టడానికి సిద్దంగా ఉన్నా ఎప్పుడు కాంట పెడుతారో తెలియక ఎండిన ధాన్యాన్ని కుప్ప పోసి దినంగా ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కాక, అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది.
విధిలేక తక్కువ ధరకు విక్రయం…
కొనుగోలు కేంద్రాల్లో పడి కాపులు కాయలేక కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై క్వింటాల్ కు 19 నుంచి 2 వేల రూపాయలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పైగా క్వింటాలుకు అదనంగా 2 నుంచి 5 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం వేస్తున్నారు. తద్వారా రైతులు క్వింటాల్ కు 300 నుంచి 400 రూపాయలు నష్ట పోతున్నారు.
అలా నష్టపోవడం ఇష్టం లేక రైతులు సర్కార్ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. కోనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు అవుతున్నా తుకాలు మొదలు కాకపోవడంతో ఆకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి పోయింది. తడిసిన ధాన్యం ఆరబెట్టలేక, ప్రభుత్వం కొనుగోలు చేపట్టక ఆవేదనతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతోనే ధాన్యం కొనుగోళ్ళలో జాప్యం జరుగుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీజన్ ఆరంభానికి ముందే కొనుగోలుకు సర్వం సిద్ధం చేసి రైస్ మిల్లుల అలాట్మెంట్ చేయాలి కానీ ఈసారి అలాట్మెంట్ చేయడంలో అధికారులు పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
గత సీజన్లో ఇచ్చిన ధాన్యం సీఎంఆర్ క్రింద రైస్ మిల్లర్స్ ఇవ్వాల్సిన బియ్యం సకాలంలో ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రైస్ మిల్లర్స్ పై కేసులు నమోదుచేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో మిల్లర్స్ ప్రభుత్వం ఇచ్చే ధాన్యం బియ్యం గా మార్చి ఇవ్వాలంటే చార్జీ పెంచాలని, బ్లాక్ లిస్టులో పెట్టిన మిల్లులకు సైతం ధాన్యం కెటాయించాలని కోరుతున్నారు. అలా కుదరదని అధికారులు స్పష్టం చేయడంతో సమస్య కొలిక్కి రాక కొలుగోలు జరగడం లేదని తెలుస్తుంది.
మరోవైపు ప్రభుత్వం మిల్లర్స్ లోపాయికారి ఒప్పందంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని మిల్లర్లు లాభ పడేలా చేయడంలో భాగంగానే కొనుగోలులో జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఓవైపు అకాల వర్షాలు మరోవైపు అన్నదాతల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.