కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగిత్యాలలో అన్నదాతలు కదంతొక్కారు. రైతుల ఐక్యవేదిక వేధిక ఆద్వర్యంలో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది రైతులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
శుక్రవారం కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15 వేలు ఇవ్వాలని, సన్నం, దొడ్డు రకం అనే తేడా లేకుండా వరి ధాన్యం క్వింటాల్ కు 500 బోనస్ ప్రకటించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కొందరు రైతులు రోడ్ఢూపైనే పడుకోగా, మరికొందరు మొకాళ్ళపై నిల్చొని నిరసన తెలిపారు. రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు.
జిల్లా నలుమూలల నుంచి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో తరలివచ్చిన అన్నదాతలు కలెక్టరేట్ లోకి దూసుకెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
కలెక్టర్ రావాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించే వరకు కదలమని భీష్మించారు. దీంతో పోలీసులు రైతులను సముదాయించి రైతు సంఘాల ప్రతినిధులు ఐదుగురిని కలెక్టర్ ను కలిసేందుకు అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.
రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతు సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు.
ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని, రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఫసల్ కు ఎకరాన 7500 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సన్న రకం దొడ్డు రకం అనే తేడా లేకుండా రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాన 5000 ప్రతి ఫసల్ కు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిన వానాకాలం పంటకు రైతు భరోసా కింద ఇవ్వాల్సిన ఎకరాన ఏడువేల 500 రూపాయలు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించాలని కోరారు. లేనిచో నేడు జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళన భవిష్యత్తులో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.