MLA Medipalli Satyam: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వెంటాడుతున్న దురదృష్టం, కరీంనగర్ లో తృటిలో తప్పిన ప్రమాదం
MLA Medipalli Satyam:
MLA Medipalli Satyam: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను దురదృష్టం వెంటాడుతుంది. అపశృతులతోపాటు ప్రమాదాల నుంచి తృటిలో బయటపడుతున్నాడు. నాలుగు మాసాల క్రితం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకోగా గత నెలలో అగంతకుడు చంపుతానని బెదిరించాడు.
తాజాగా కరీంనగర్ లో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఇందిరమ్మ విగ్రహం వద్ద గ్రానైట్ బండ విరగడంతో ఎమ్మెల్యే తో సహా పలువురు క్రింద పడ్డారు. ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పరిస్థితులు అనుకూలించడం లేదు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయిన సత్యం ను విధి వెంటాడుతుంది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం ప్రమాదానికి గురయ్యారు.
తెలంగాణ చౌక్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఐలాండ్ గద్దె కూలడంతో ఎమ్మెల్యే సత్యం, డిసిసి అధికార ప్రతినిధి పద్మాకర్ రెడ్డి తోపాటు పలువురు నాయకులు కింద పడ్డారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ పలువురు నాయకులు ఫోటో దిగేందుకు అందరు గద్దెపై నిల్చున్నారు.
ఎక్కువ మంది గద్దెపై ఉన్న గ్రానైట్ బండపైకి ఎక్కడంతో గ్రానైట్ బండ క్రింద బేస్ లేకపోవడంతో గ్రానైట్ విరగడంతో ఎమ్మెల్యే తో సహా పలువురు కింద పడ్డారు. ఎమ్మెల్యే సత్యం ముక్కుకు స్వల్ప గాయం అయింది. ఎవరికి ఏమి కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
20 లక్షలు ఇవ్వాలి..లేకుంటే చంపుతానని బెదిరింపు
నాలుగు మాసాల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా ఇద్దరు పిల్లలకు ఎమ్మెల్యే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సత్యంకు ఓ అగంతకుడు ఫోన్ చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని లేకుంటే నిన్ను చంపి ఇద్దరు పిల్లలను అనాథలను చేస్తామని బెదిరించాడు. ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించగా కొత్తపల్లి పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఫోన్ లో గత నెల రోజులుగా బెదిరిస్తున్న వ్యక్తి ఎవరనేది సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. నిందితుడు లండన్ ఉన్నట్లు నిర్థారించి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యేను బెదిరించింది అఖిలేష్ రెడ్డి
సెప్టెంబరు 28న ఉదయం, రాత్రి సమయాల్లో ఎమ్మెల్యే వాట్సప్ నంబరుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే గౌరవానికి భంగం కలిగించడంతో పాటు పిల్లలను అనాథలు అయ్యేలా చేస్తానని బెదిరించాడు. వెంటనే ఎమ్మెల్యే సిపి అభిషేక్ మోహంతికి ఫిర్యాదు చేసి నెంబర్ బ్లాక్ చేశాడు. అయినా వాయిస్ మెస్సెజ్ తో బెదిరింపులకు పాల్పడడంతో సిపి సూచన మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవానీనగర్ కు చెందిన యాస అఖిలేశ్ రెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం అతను లండన్ లో ఉన్నట్లు నిర్ధారించి.. అతడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై లుక్ అవుట్ నోటీసు లు జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
వివాదాలకు దూరంగా సౌమ్యుడిగా ఉంటూ విద్యావంతుడైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్స్ తో పాటు తృటిలో ప్రమాదాలు తప్పడం చర్చనీయాంశంగా మారింది.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)