AP Paddy Procurement : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, మద్దతు ధర రూ.2300గా నిర్ణయం
AP Paddy Procurement : 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికేంద్రీకరణ విధానంలో కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించింది.
AP Paddy Procurement : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ-పంట, ఈ కేవైసీ సమాచారంతో రైతులు, కౌలు రైతుల ధాన్యం కొనుగోళ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు తర్వాత ఆధార్ అనుసంధానమైన ఈ-పంట , ఈ-కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ధాన్యం కొనుగోలు చేసే రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వరికి నిర్దేశించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ కు రూ.2300, గ్రేడ్ ఏ రకం క్వింటాల్ కు రూ.2320 చెల్లించాలని వెల్లడించింది. ఈ ఖరీఫ్ సీజన్ లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ఆపరేషన్ల పర్యవేక్షణనను జిల్లా కలెక్టర్లు, జేసీలను అప్పగించింది.
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు
ఖరీప్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఇటీవల జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్… ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని వెల్లడించారు. రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తామని ప్రతీ రైతుకీ భరోసా ఇస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం