AP Assembly : ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. ఉత్కంఠకు తెర!-pulaparthi ramanjaneyulu appointed as andhra pradesh pac chairman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly : ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. ఉత్కంఠకు తెర!

AP Assembly : ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. ఉత్కంఠకు తెర!

Basani Shiva Kumar HT Telugu
Nov 22, 2024 04:28 PM IST

AP Assembly : అసెంబ్లీలో పీఏసీ ఎన్నిక ముగిసింది. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఇటు పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.

పులపర్తి రామాంజనేయులు
పులపర్తి రామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా శ్రీరాం రాజగోపాల్‌, బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్‌ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకొని.. పులపర్తి రామాంజనేయులను ఎన్నుకున్నారు.

పీఏసీ సభ్యులకు తొలిసారిగా ఎన్నిక జరిగింది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరిగింది. సంఖ్యా బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. ఆ పార్టీ తరఫున మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. ఆ ఎన్నికలో పులపర్తి రామాంజనేయులను విజయం వరించింది.

అసెంబ్లీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారని ఆరోపించారు. 2047 విజన్ డాక్యుమెంట్ తెచ్చాం.. అనివార్య పరిస్థితుల్లో 1999లో ధరలు పెంచామని వివరించారు. ప్రజలు నమ్మారు‌.. మార్చక్కర్లేని విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పారు. నేర రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదన్న సీఎం సంపద కలిగిన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఏపీ తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

'చంద్రబాబు 4.0లో వెర్షన్ వన్ ఇప్పుడు ప్రారంభమైంది. నేను ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తా. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం అవుతాయి. 6 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌తో పాటు.. ఆలిండియా సర్వీసెస్ ఆఫీసర్ల క్వార్టర్స్ నిర్మాణం పూర్తవుతుంది. మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తెస్తాం. 2027నాటికి పోలవరం పూర్తి చేస్తాం. డిసెంబర్ నుంచి నేను కూడా గేర్ మార్చుకుంటా. మీరు కూడా నాతో కలిసి పనిచేయాలి. అమరావతి పూర్తయి ఉంటే.. ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల కోట్లు వచ్చేవి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'అక్రమాల్లో జగన్ పేరుప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. అవినీతి మూలాలన్నీ జగన్‌ వైపు చూపిస్తున్నాయి. గంగవరం వాటాలను రూ.651 కోట్లకు అదానీకి ఇచ్చారు. జగన్‌ స్కామ్‌లపై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి' అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగాయి. 59 గంటల 57 నిమిషాల పాటు సభ సాగింది. 75 ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు చెప్పారు. 21 బిల్లులకు ఆమోదం లభించింది.

Whats_app_banner