AP Garbage Tax: ఏపీలో చెత్తపన్ను వసూళ్ల నుంచి విముక్తి, సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం-assembly approves amendment bill to exempt ap from garbage tax collection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Garbage Tax: ఏపీలో చెత్తపన్ను వసూళ్ల నుంచి విముక్తి, సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం

AP Garbage Tax: ఏపీలో చెత్తపన్ను వసూళ్ల నుంచి విముక్తి, సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 21, 2024 06:09 PM IST

AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను వసూళ్లకు అసెంబ్లీ మంగళం పాడింది. గత కొన్నేళ్లగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన చెత్త పన్ను వసూళ్లను రద్దు చేయాలనే సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. ఏపీలో వైసీపీ పాలనలో ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌, దుకాణాల నుంచి చెత్తసేకరణకు పన్నులు వసూలు చేశారు.

రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తూ సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం
రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తూ సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం

AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైన చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు,కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు.

2014-19 మధ్య టీడీపీ హయాంలో మున్సిపాలిటీల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచలేదని నారాయణ గుర్తు చేశారు. ప్రజలు వద్దని గొడవ చేసినా బలవంతంగా చెత్త పన్ను తో నాటి వైసీపీ ప్ర‌భుత్వం ఇబ్బంది పెట్టింది అని విమ‌ర్శించారు. చెత్తపన్ను యూజర్ చార్జీలు రద్దు చేస్తూ మున్సిపల్ లాస్ చట్టంలో చేసిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఈ బిల్లును ఆమోదించాలని మంత్రి నారాయణ సభలో ప్రతిపాదించారు...బిల్లుపై కాసేపు చర్చ జరిగిన తర్వాత సభ ఆమోదించింది.

2020లో చట్ట సవరణ…

రాష్ట్రవ్యాప్తంగా 40 మున్సిపాలిటీల్లో సర్వీసు ప్రొవైడర్ల ద్వారా చెత్త సేకరించేందుకు వీలుగా 2020లో మున్సిపల్ చట్టంలో వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారం గృహాలకు నెలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకూ అలాగే వాణిజ్య సముదాయాలకు నెలకు 100 నుంచి 10000 రూపాయల వరకూ వసూలు చేశారు 2021 నవంబర్ నుంచి ప్రజల నుంచి బలవంతంగా పన్ను వసూలు చేశారు.

విశాఖపట్నం ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో స్వయం భూ, అనంతపురం ప్రాంతంలో రెడ్డి ఎంటర్ప్రైజేస్ ద్వారా చెత్త సేకరణ ప్రారంభించారు. ఇలా వాహనాల ద్వారా చెత్త సేకరణకు నెలకు ఒక్కో వాహనానికి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయలు చెల్లించేవారు.వాటికి నెలకు రూ.13.9 కోట్లు చెల్లించేవారు.

2021 నవంబర్ నుంచి 2024 జూలై వరకూ 325 కోట్లు రూపాయలు బిల్లు అయితే 249 కోట్లు చెల్లించారు.అయితే ప్రజలు మాత్రం చెత్త పన్ను వద్దని గొడవ చేసినా పట్టించుకోలేదు.కొన్ని చోట్ల ఇళ్లకు ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్న ఇంటికి కూడా 356 రూపాయలు చెత్త పన్ను వేశారు.2014,-2019 మధ్య టీడీపీ అధికారం లో ఉన్న సమయంలో మున్సిపాలిటీల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి నారాయణ సభలో తెలిపారు.

చెత్త పన్ను 188 కోట్లు వసూలు చేసినట్లు గత ప్రభుత్వం చూపించిందని మొత్తం రూ. 325 కోట్లకు గాను మిగిలిన డబ్బులు చెల్లించేందుకు స్వచ్ఛ భారత్ నుంచి 90.19 కోట్లు, హౌసింగ్ బోర్డు నుంచి రూ.32.55 కోట్లు, డీటీసీపీ నుంచి రూ.9.6 కోట్లు, రాజీవ్ స్వ‌గృహ నుంచి రూ. 4.56 కోట్లు అప్పు తీసుకున్నారని...అయితే కాంట్రాక్ట‌ర్ల‌కు ల‌బ్ది చేకూర్చాల‌నే ఉద్దేశంతోనే ఇత‌ర విభాగాల నుంచి కూడా అప్పులు తీసుకున్నారని ఆరోపించారు.

విచారణ జరుపుతాం..

చెత్త ప‌న్ను సేక‌ర‌ణ‌,అప్పుల‌పై విచార‌ణ చేయిస్తాం...గ‌త ప్ర‌భుత్వంలో 85 ల‌క్ష‌ల ట‌న్నుల చెత్త పేరుకుపోయిందని, కొన్ని చోట్ల ఓ కాంట్రాక్ట్ సంస్థ చెత్త తీసుకెళ్లి మైనింగ్ చేసిన గోతుల్లో వేసింది.2014-19 మ‌ధ్య ఉమ్మ‌డి 10 జిల్లాల్లో వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్లు నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించినట్టు చెప్పారు. విశాఖ‌ప‌ట్నం,గుంటూరులో ఈ ప్లాంట్లు చ‌క్క‌గా న‌డుస్తున్నాయని మిగ‌తా 8 ప్లాంట్లు ఏర్పాటు చేయ‌కుండా వాటిని ర‌ద్దు చేశారని సభకు వివరించారు. ప్లాంట్లు గ‌నుక ఏర్పాటు చేసిన‌ట్ల‌యితే ఇంత భారీ స్థాయిలో చెత్త పేరుకుపోయేది కాదన్నారు.

చట్టసవరణల తొలగింపు..

ఒక ప‌క్క ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నా విన‌కుండా బ‌ల‌వంతంగా ప‌న్నులు వ‌సూలు చేశారని కొన్ని చోట్ల‌యితే ట్రాక్ట‌ర్ల‌తో చెత్త‌ను తీసుకొచ్చి షాపుల ముందు అధికారులే వేసిన ప‌రిస్థితి ఉదంతాలు ఉన్నాయన్నారు. కొంద‌రు మంత్రులు కూడా చెత్త‌ప‌న్ను క‌ట్ట‌లేరా అంటూ హేళ‌న‌గా కూడా మాట్లాడారని కొన్ని చోట్ల అయితే ప‌న్ను క‌ట్ట‌లేద‌ని తాగునీటి స‌ర‌ఫ‌రా కూడా నిలిపివేసారని నారాయణ గుర్తు చేశారు.

అధికారంలోకి వ‌స్తే చెత్త‌ప‌న్ను ర‌ద్దు చేస్తామ‌ని మా నాయ‌కుడు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెర‌వేరుస్తూ చెత్త‌ప‌న్నును ఇప్ప‌టికే ర‌ద్దు చేశామని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెత్త‌ప‌న్నుపై చ‌ట్టంలో చేసిన మార్పుల‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి...1955 మున్సిప‌ల్ కార్పొరేష‌న్స్ యాక్ట్ లోని సెక్ష‌ణ్ 491-ఏ, ఏపీ మున్సిపాల్టీల చ‌ట్టం 1965లోని 170- బి ల‌ను తొల‌గిస్తూ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టినట్టు తెలిపారు. ఈ బిల్లుకు సభ అమోదం తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం