AP Cyclone Alert: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్‌, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాను ముప్పు-big alert for ap farmers low pressure in bay of bengal cyclone threat to ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cyclone Alert: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్‌, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాను ముప్పు

AP Cyclone Alert: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్‌, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాను ముప్పు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 22, 2024 11:44 AM IST

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో శనివారం ఏర్పాడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. పంటలు చేతికొచ్చే కాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు వాతావరణ శాఖ అలర్ట్‌, పొంచి ఉన్న తుఫాను ముప్పు
ఆంధ్రప్రదేశ్‌ రైతులకు వాతావరణ శాఖ అలర్ట్‌, పొంచి ఉన్న తుఫాను ముప్పు

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడనంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది.

దక్షిణ అండమాన్‌ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం క్రమంగా తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

23వ తేదీన ఏర్పడే అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చే వారం 27వ తేదీ నాటికి తమిళనాడు, ఏపీలలో తీరం దాటుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని, వరికోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్‌…

సుమత్రా తీరంలో ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మరియు దక్షిణ అండమాన్ సముద్రం పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో మంగళ, బుధవాాారాల్లో (నవంబర్‌ 26,27తేదీలలో) కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. ఖరీఫ్‌ పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలకు నాలుగైదు రోజులు సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Whats_app_banner