Warangal : వరంగల్ భూములపై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కన్ను.. గ్యాంగులతో బెదిరింపులు
Warangal : మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆయన వరంగల్ నగరంలో భూదందాలు మొదలుపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొద్దిరోజుల కిందట పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం.. వరంగల్ ట్రైసిటీ పరిధి కాజీపేట శివారులోని అసైన్డ్ ల్యాండ్ లాక్కుని, దౌర్జన్యానికి దిగుతున్నారనే వ్యవహారం కలకలం రేపింది. అప్పట్లో బాధితులు ధర్మసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హనుమకొండలోని న్యూశాయంపేటలో కూడా నిరుపేద కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు చూడటం, ఆ ల్యాండ్ లో ఉన్న కంటైనర్ ఇంటిని ఎత్తుకెళ్లడంతో ఆ పంచాయితీ కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇలా వరుస భూవివాదాలతో శంకర్ నాయక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. తొందర్లోనే వరంగల్ నగరంలో శంకర్ నాయక్ చేసిన మరిన్ని భూబాగోతాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
పెట్రోల్ బంక్ కోసం..
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ గ్రామ శివారులోని 339/7 సర్వే నెంబర్ లో.. మునిగాల పోచయ్యతో పాటు మరికొంతమందికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 గుంటల చొప్పున వ్యవసాయ భూమిని ఇచ్చింది. ఈ స్థలం వరంగల్– హైదరాబాద్ హైవేను ఆనుకుని ఉంది. కమర్షియల్ అవసరాలకు ఉపయోగపడేలా ఉండటంతో ఈ స్థలంపై 2014లో అప్పటి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కన్నేశారు. ఆ స్థలాన్ని తనకు ఇవ్వాలని, సంబంధిత భూమి యజమానులను ఆదుకుంటానని నమ్మబలికాడు. అయినా వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ స్థలం మొత్తం కబ్జా చేశాడు.
ఆ తరువాత పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి పర్మిషన్లు తీసుకుని, తనకున్న ప్రోద్బలంతో ధరణిలో సర్వే నెంబర్ 339/7తో పాటు 339/8, 339/9 సర్వే నెంబర్లు కూడా కనిపించకుండా చేశాడు. కొద్దిరోజులుగా మునిగాల పోషయ్యతో పాటు ఇతర బాధితులు స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరుగుతుండగా.. రెండు నెలల కిందట సెప్టెంబర్ రెండో వారంలో శంకర్ నాయర్ పెట్రోల్ బంక్ పనులు స్టార్ట్ చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని పనులు అడ్డుకోగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో బాధితులు డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. తమకున్న పొలిటికల్ పవర్ తో పోలీసులు మేనేజ్ చేయొచ్చనే ఉద్దేశంతో శంకర్ నాయక్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శంకర్ నాయక్ కు సంబంధించిన మరి కొంత మంది వ్యక్తులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారు. ఇరువర్గాలు ధర్మసాగర్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. ఆ సమయంలో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది.
దౌర్జన్యం..
వరంగల్ జిల్లా పైడిపల్లి గ్రామానికి చెందిన రుద్రోజు పద్మావతికి.. హనుమకొండలోని న్యూ శాయంపేట శివారు వినాయక నగర్ దుర్గాదేవి కాలనీలో 186 సర్వే నెంబర్ లో 497 చదరపు గజాల స్థలం ఉంది. దానిని పద్మావతి తల్లిదండ్రులు పసుపు కుంకుమల కింద ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకొని కొద్దిరోజుల కిందట ఓ కంటైనర్ హౌజ్ ను అందులో ఏర్పాటు చేసుకున్నారు.
ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా.. ఈ నెల 16న తమ ఇంటి స్థలాన్ని చూసేందుకు భూమి యజమాని రుద్రోజు పద్మావతి, తన భర్త సుగ్రీవాచారి, కుమారుడు దత్తరాజన్ ముగ్గురూ కలిసి వచ్చారు. అక్కడున్న పరిస్థితులు చూసి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
తాము నిర్మించుకున్న ప్రహరీ ఒకవైపు కూల గొట్టి ఉండగా.. అందులో ఉన్న ఓ మహిళను భూ యజమానులు నువ్ ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆ ఇల్లు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దేనని, అందులో తమను ఉండమని చెప్పారంటూ సమాధానం ఇచ్చింది. ఆ మహిళ తమకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేయగా.. అజ్మీరా వెంకటనాయక్, బానోతు ప్రేమ్ నాయక్, బానోత్ మోహన్ లాల్ అనే ముగ్గురితో పాటు మరికొందరు అక్కడికి చేరుకుని పద్మావతి దంపతులపై దౌర్జన్యానికి దిగారు.
ఆ భూమి శంకర్ నాయక్ దేనని, వెంటనే అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా భయభ్రాంతులకు గురి చేశారు. భయపడిపోయిన బాధితులు అక్కడి నుంచి వచ్చేశారు. ఆ మరునాడు సుగ్రీవాచారి తన స్నేహితులను తీసుకుని ప్లాట్ వద్దకు వెళ్లగా.. అక్కడ తాము ఏర్పాటు చేసుకున్న కంటైనర్ హౌజ్ కూడా కనిపించలేదు. దీంతో వారు అక్కడున్న వ్యక్తులను ప్రశ్నించగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. బాధితులు ఈ నెల 20న సాయంత్రం సమయంలో సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
గ్యాంగులతో బెదిరింపులు..
శంకర్ నాయక్ వరంగల్ నగరంలో కొంతకాలంగా అసైన్డ్ భూములతో పాటు నిరుపేదల భూములపై కన్నేశాడనే ప్రచారం ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండగా.. తాను కన్నేసిన భూములను కబ్జా చేసేందుకు శంకర్ నాయక్ ప్రత్యేకంగా గ్యాంగులు కూడా మెయింటైన్ చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.
భూముల మీదకు వెళ్లి గొడవలు చేయడం, అవతలి వాళ్లు తిరగబడితే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. శంకర్ నాయక్ పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే శంకర్ నాయక్ వ్యవహారం వరంగల్ నగరంలో హాట్ టాపిక్ గా మారగా... బాధితులకు న్యాయం చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)