YS Jagan Warning to Police : సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్-ys jagan mass warning to andhra pradesh police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Warning To Police : సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్

YS Jagan Warning to Police : సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్

Basani Shiva Kumar HT Telugu
Nov 07, 2024 04:34 PM IST

YS Jagan Warning to Police : ఏపీ పోలీసుల తీరుపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కొందరు పోలీసులు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. చట్టం దాటి అరెస్టులు చేసిన పోలీసులను వదిపెట్టబోనని జగన్ వార్నింగ్ ఇచ్చారు. సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

పోలీసుల తీరుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్పీ.. సుబ్బారాయుడి పేరు ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన్ను చంద్రబాబు తెలంగాణ నుంచి డిప్యూటేషన్‌పై తెప్పించుకున్నారని.. మళ్లీ అక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు.

'చూస్తూ ఊరుకోం. పోలీసులకు చెప్తున్నా.. ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం. రిటైర్ అయినా మళ్లీ పిలిపిస్తాం. వాళ్లు ఒక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. పోలీసులు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ మంచిగా పనిచేయాలి. ఈరోజు వాళ్లు అధికారంలో ఉండొచ్చు. రేపు మేము అధికారంలో ఉండొచ్చు. రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే.. మంచిది కాదు' అని జగన్ సూచించారు.

పవన్ వ్యాఖ్యలపైనా జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. 'నీ సొంత నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు, కౌన్సిలర్ భర్త ఒక భర్త మహిళను డంప్ యార్డులో అత్యాచారం చేస్తే.. ఏం చేశావ్.. ఇది నీ సొంత నియోజకవర్గంలో జరిగింది. తోలు తీస్తా.. అని సినిమా డైలాగ్‌లు కొడతాడు. కానీ.. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం దళిత హోమ్ మినిస్టర్‌పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే.. ఆడపిల్ల, ఏమైనా అంటే పడుతుందని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుందో ఈయనకు తెలియదా.. అది ముఖ్యమంత్రి సబ్జెక్టు కాదా' అని జగన్ ప్రశ్నించారు.

సరస్వతి పవర్ భూముల వ్యవహారంపైనా జగన్ స్పందించారు. 'నవంబర్ 5న ఈయన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దగ్గరకు వెళ్లారు. అక్టోబర్ 26వ తారీఖున లోకల్ ఎమ్మార్వో అక్కడికి వెళ్లి భూములను సర్వే చేశారు. ఈ కంపెనీకి ఇచ్చినది అంతా పట్టా భూములే అని ఎమ్మార్వో చెప్పారు. ఈ భూముల్లో ఎక్కడా చెరువు, అటవీ భూమి లేదు అని ఎమ్మార్వో ఆ వీడియోలో స్పష్టం చేశారు. అక్కడ గ్రామసభ పెట్టి.. రైతులనే ధరలు ఎంత కావాలని అడిగాం. రైతులు ఎకరాకు 2.70 లక్షలు అడిగితే.. మేము రూ.3 లక్షలు ఇచ్చాం. అదీ జగన్ అంటే' అనీ మాజీ సీఎం వ్యాఖ్యానించారు.

'ఏపీలో అరాచక పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. చీకటి రోజులు నడుస్తున్నాయి. ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. హామీలు అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తున్నారు. వ్యవస్థలను నీరుగార్చి.. నాశనం చేస్తున్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణలను నిర్వీర్యం చేశారు. వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు ఇస్తున్నారు. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. 5 నెలల్లో 91మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి' అని జగన్ ఆరోపించారు.

'సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు.. ప్రతివర్గాన్ని మోసం చేస్తున్నారు.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూల్స్ గాడితప్పాయి. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఈ-క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పథకాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు డోర్‌ డెలివరీ ఊసే లేకుండా పోయింది' అని జగన్ విమర్శించారు.

Whats_app_banner