Maoist Encounter : భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 10 మంది మృతి
Maoist Encounter : సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటు ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా చంపేశారు.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్జి అటవీప్రాంతంలో ఉదయం నుండి ఎదురు కాల్పులు. కొనసాగుతున్నాయి.
ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలానికి అదనపు బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. పదిమంది మావోయిస్టు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఏకే47 ఎస్ఎల్ఆర్ తోపాటు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఇటు తెలంగాణ, అటు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.
మరోవైపు ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. పోలీస్ ఇన్ ఫార్మర్స్ నెపంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి సహా ఇద్దరిని హతమార్చారు. తెల్లవారుజామున వారి ఇళ్ల వద్ద నరికి చంపి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ జంట హత్యలు ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఎటాక్ చేసిన మావోయిస్టులు ఇరువురిని హతమార్చారు. మృతులు ఈక అర్జున్, ఈక రమేష్ అనే ఆదివాసీలుగా గుర్తించారు. మృతుడు ఈక రమేష్ ప్రభుత్వ ఉద్యోగి. పంచాయతీ సెక్రటరిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరిని నరికి చింపిన మావోయిస్టులు సంఘటనా స్థలంలో రెండు లేఖలు వదిలి వెళ్లారు. ఈ లేఖలు వెంకటాపురం, వాజేడు ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడని, పక్కనే ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కూడా మావోయిస్టుల కదలికలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడని లేఖలో ఆరోపించారు. ఎస్ఐబీ డైరెక్షన్ మేరకు ఛత్తీస్‌ఘడ్- తెలంగాణా సరిహద్దులోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శ్యామల దొడ్డి, వాయిపేట గ్రామాల్లో స్నేహితులను ఏర్పాటు చేసుకొని మావోయిస్టుల సమాచారం సేకరిస్తున్నాడని లేఖలో స్పష్టం చేశారు.
ఈమధ్య కాలంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగిన పలు ఘాతుకాలకు పంచాయతీ కార్యదర్శి రమేష్ కారణమని లేఖలో పేర్కొన్నారు. వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఈక అర్జున్ చేపలవేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్నులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ పద్ధతి మార్చుకోక పోవడంతో హతమార్చామని లేఖలో స్పష్టం చేశారు.