మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి పంచాయతీ కార్యదర్శి సూసైడ్ అటెంప్ట్ చేసింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా తన ఆత్మహత్యకు యాదగిరి అనే వ్యక్తితో పాటు కొందరు అధికారుల వేధింపులే కారణమంటూ సూసైడ్ లెటర్ రాసి పెట్టడం కలకలం రేపుతోంది. స్థానికులు, సూసైడ్ నోట్ లో తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ మండలం కురవి మండలం తట్టుపల్లి పంచాయతీలో వంగూరి నాగలక్ష్మి అనే యువతి పంచాయతీ సెక్రటరీగా పని చేస్తోంది. రెండు సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తుండగా.. దొంతు యాదగిరి అనే ఓ యూ ట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ఆమెను కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. సెక్రటరీ ఏ పని చేసినా అందులో లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
దీంతోనే కొంత కాలం కిందట నాగలక్ష్మి స్థానిక అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోకపోగా.. యాదగిరి చేసిన ఆరోపణలపై ఎంక్వైరీ నిర్వహించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంత వరకు బాగానే ఉండగా.. ఇటీవల రూపొందించిన పంచాయతీ ఓటర్ లిస్ట్ ను సెప్టెంబర్ 27న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి పంపించాల్సి ఉండగా.. ఆ లిస్టు మరునాడు చేరిందనే కారణంతో నాగలక్ష్మికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
నాగలక్ష్మికి జిల్లా అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులను కొందరు వ్యక్తులు తట్టుపల్లి గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అధికారుల మధ్యలోనే ఉండాల్సిన షోకాజ్ నోటీసులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో నాగలక్ష్మి మనోవేదనకు గురైంది.
తనపై వేధింపుల గురించి ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు, తనపై వచ్చిన ఆరోపణల కారణంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఓ వైపు యాదగిరి వేధింపులు, అధికారుల తీరుతో మానసికంగా కుంగి పోయిన నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం విధుల్లోకి వెళ్లిన నాగలక్ష్మి ‘కలెక్టర్ గారికి మరణ వాంగ్మూలం’ అంటూ జరిగిన విషయాన్ని మొత్తం లేఖ రూపంలో రాసింది. అనంతరం తట్టుపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ లోనే దోమల నివారణకు స్ప్రే చేసే మందు తాగేసింది. దీంతో గమనించిన స్థానిక కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి… డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. కాగా పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం పట్ల పంచాయతీ సెక్రటరీల యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
పూర్తి వివరాలపై ఆరా తీసి, అధికారుల తీరపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేనిపోని ఆరోపణలు చేసి నాగలక్ష్మి సూసైడ్ అటెంప్ట్ కు కారణమైన యాదగరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ప్రస్తుతం నాగలక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు.