Maoist Traps: భద్రాద్రి జిల్లా చర్లలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు నిర్మించిన బూబీ ట్రాప్స్ ధ్వంసం
Maoist Traps: భద్రాద్రి జిల్లా చర్లలో పోలీసులు, కూంబింగ్ పార్టీలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన "బూబీ ట్రాప్స్" ను గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు.
Maoist Traps: తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు బూబీ ట్రాప్స్ లు అమరుస్తున్నారు.
ఆదీవాసీలు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన బూబీ ట్రాప్స్ ను సోమవారం పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంతో పాటు తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ప్రాంతాలలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ, చతీస్ఘడ్ పోలీసుల, CRPF పోలీసులు సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.
మావోయిస్టు ఏరియా డామినేషన్ ఆపరేషన్లో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకొని నిషేధిత సిపిఐ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలతో పాటు వారికి సంబందిచిన జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన 70 బూబీ ట్రాప్స్ ను గుర్తించారు.
మావోయిస్టులు గుంతలు త్రవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన ఇనుప కడ్డీలను తొలగించి వాటిని స్వాదీనం చేసుకున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీలకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదీవాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యల వల్ల నిత్యం బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ఆదివాసీలు, జంతువులు సంచరించే ప్రాంతాలలో వారు అమర్చిన IEDs, బూబీ ట్రాప్స్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోవడం, తీవ్రంగా గాయాలపాలవ్వడం జరిగిందని అన్నారు. కావున సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవల ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మరణించడం జరిగిందని తెలిపారు. ఆదివాసీల కోసమే మా పోరాటం అంటూ నీతులు వల్లించే మావోయిస్టు నాయకులు వ్యవసాయ రీత్యా, అటవీ ఉత్పత్తుల సేకరణలో భాగంగా సంచరించే ఆదివాసీలకు తీవ్ర నష్టం కలిగేలా చేస్తున్నారన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేసారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)