Stock market today: స్టాక్ మార్కెట్ దూకుడు; సెన్సెక్స్ 1800 పాయింట్లు అప్; ర్యాలీ కి కారణాలేంటి? ఇది కొనసాగుతుందా?..
Stock market today: నవంబర్ 22 శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లకు శుభదినం. ఈ రోజు బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాల దారిలో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ ఈ ఒక్క రోజే 1800 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే, ఈ ర్యాలీ కొనసాగుతుందా? లేక మళ్లీ పడిపోతుందా? అని ఇన్వెస్టర్లు అనుమానిస్తున్నారు.
Stock market today: గత సెషన్లో అర శాతానికి పైగా క్షీణించిన భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నవంబర్ 22, శుక్రవారం సుమారు 2 శాతం లాభాలతో పుంజుకున్నాయి. శుక్రవారం సెన్సెక్స్ 77,155.79 పాయింట్ల వద్ద ప్రారంభమై 2.4 శాతం పెరిగి ఇంట్రా డేలో 78,978.23 కు చేరుకుంది. నిఫ్టీ 23,411.80 వద్ద ప్రారంభమై 2.3 శాతం పెరిగి 23,897.95 వద్దకు చేరుకుంది.
రూ. 4 లక్షల కోట్ల లాభం
మధ్యాహ్నం గం.2.30 సమయానికి సెన్సెక్స్ (Sensex) 2.23 శాతం పెరిగి 78,872.86 వద్ద, నిఫ్టీ 2.20 శాతం పెరిగి 23,864.05 వద్ద ట్రేడవుతున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా అర శాతం లాభపడటంతో మార్కెట్ విస్తృత స్థాయి కొనుగోళ్ల ఆసక్తిని కనబరిచింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) గత సెషన్ చివరలో రూ.425 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం, పుంజుకుని దాదాపు రూ.429 లక్షల కోట్లకు పెరిగింది.
భారత స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోంది?
దేశీయ మార్కెట్లో నేడు పలు రంగాల్లో ఆరోగ్యకరమైన కొనుగోళ్లు జరిగాయని, అదానీ ఇష్యూతో జరిగిన నిన్నటి భారీ అమ్మకాల తర్వాత స్మార్ట్ రికవరీ కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్ పుంజుకోవడానికి ప్రాథమిక అంశాల కంటే సాంకేతిక అంశాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ట్రేడర్లకు ఇప్పుడు 23,350, 23,400 కీలకం కానున్నాయి. 23,400 పైన, 23,500-23,550 వరకు శీఘ్ర పుల్ బ్యాక్ ర్యాలీని చూడవచ్చు. మరోవైపు 23,250 లెవెల్ కన్నా తగ్గితే మళ్లీ అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి మార్కెట్ 23,175-23,150 పాయింట్లకు పడిపోవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
ఈ ర్యాలీ కొనసాగుతుందా?
పెరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ (russia ukraine) యుద్ధ తీవ్రత, బలహీనమైన జూలై-సెప్టెంబర్ త్రైమాసిక రాబడులు, గణనీయమైన విదేశీ మూలధన ప్రవాహాలపై ఆందోళనలు ఇంకా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాలను నమోదు చేసింది. నిన్నటి పతనం తర్వాత మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుందని, ఇది మళ్లీ పతనం దిశగా వెళ్లవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు కావడంతో ర్యాలీ కొనసాగుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. రేపు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఎన్డీఏకు ప్రతికూలంగా వస్తే సోమవారం మార్కెట్ (stock market) పతనమయ్యే అవకాశం ఉంది’’ అని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ అన్నారు. సాధారణంగా, మార్కెట్ గణనీయంగా పడిపోయినప్పుడు, ఆ మర్నాడు బౌన్స్ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ‘‘కొన్నిసార్లు టెక్నికల్ లెవల్స్ పరంగా డెడ్ క్యాట్ బౌన్స్ ఉండొచ్చు. మార్కెట్ 200 డిఎంఎ చుట్టూ తిరుగుతోంది. ఇది స్థాయిని దాటిన వెంటనే, కొంత ఆల్గో ట్రేడింగ్, ఒక రకమైన సంస్థాగత కొనుగోళ్లు ఉంటాయి’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వీపీ (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.