strategies at Market corrections: స్టాక్ మార్కెట్ కరెక్షన్ టైమ్ లో ఇన్వెస్టర్లు ఏ వ్యూహాలు ఫాలో కావాలి? 7 టిప్స్..
Stock Market corrections: ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లు అత్యంత ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. దాదాపు గత రెండు నెలలుగా అన్ని రంగాల స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ప్రస్తుతం మార్కెట్ కరెక్షన్ ఫేజ్ లో ఉంది. ఈ సమయంలో ఎలాంటి స్ట్రాటెజీ ఫాలో కావాలో ఇక్కడ చూద్దాం.
Stock Market corrections: స్టాక్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించి వారికి ప్రస్తుతం మార్కెట్ల పరిస్థితి కొంత భయం కొలిపేలా ఉంటుంది. కానీ, స్టాక్ మార్కెట్లో కొంత అనుభవం ఉన్నవారికి ఇది సహజ పరిణామంగానే కనిపిస్తుంది. పెట్టుబడి ప్రయాణంలో మార్కెట్ దిద్దుబాట్లు అనివార్యమైన భాగమని వారికి తెలుసు. ఈ సమయంలో భయాందోళనలకు గురై దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు. స్టాక్ ధరలు పడిపోతున్నప్పుడు ఆందోళన చెందడం సహజమే అయినప్పటికీ, ఈ సమయం వృద్ధి, అభ్యాసం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలను అందిస్తుందని తెలుసుకోవాలి. మీ పోర్ట్ ఫోలియో, మీ పెట్టుబడి మనస్తత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ మార్కెట్ తిరోగమనాన్ని ఒక అవకాశంగా మార్చడానికి ఇక్కడ ఏడు మార్గాలు ఉన్నాయి.
గత నిర్ణయాలపై సమీక్ష వద్దు
సాధారణంగా మార్కెట్లు పతనమైనప్పుడు, గతంలోకి వెళ్లి, అప్పుడు ఆ స్టాక్స్ ను అమ్మేసి ఉంటే బావుండును అని దాదాపు ప్రతీ ఇన్వెస్టర్ భావిస్తారు. వ్యాల్యుయేషన్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు స్టాక్స్ ను అమ్మడం మంచి వ్యూహమే. అయినా, ప్రతీ సారి అది వర్కౌట్ కాదు. ఎందుకంటే, కరెక్షన్ లేదా దిద్దుబాటు కచ్చితంగా ఎప్పుడు ప్రారంభమవుతుందని అంచనా వేయడం దాదాపు అసాధ్యం. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు కూడా అంచనా వేయలేరు. అందువల్ల, గతంలో తీసుకున్న లేదా తీసుకోని నిర్ణయాల గురించి బాధపడడం మానేయండి. మీ దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక, రిస్క్ టాలరెన్స్ ఆధారంగా ముందుచూపుతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టండి.
రిస్క్ టాలరెన్స్ రిస్క్
రిస్క్ తో మీ భావోద్వేగ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మార్కెట్ దిద్దుబాట్లు ఒక అవకాశాన్ని అందిస్తాయి. మీకు ఎక్కువ ఆందోళన కలిగించే పెట్టుబడులపై దృష్టి పెట్టండి. మీ పెట్టుబడి విధానాన్ని మెరుగుపరచడానికి ఈ అవగాహనను ఉపయోగించండి. కొన్ని స్టాక్స్ మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుంటే, ఆ కంపెనీ ప్రాస్పెక్ట్స్ ను అధ్యయనం చేసి, కరెక్షన్ సమయంలో యావరేజ్ చేయడమా? లేక కొంతకాలం వెయిట్ చేసి అమ్మేయడమా? అని నిర్ణయించుకోండి. మీ నిజమైన రిస్క్ ప్రొఫైల్ కు అనుగుణంగా మీ పోర్ట్ ఫోలియోను రూపొందించడానికి ఇలాంటి మార్కెట్ తిరోగమన సమయాలు అవకాశం కల్పిస్తాయి. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి మార్కెట్ అస్థిరతలను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
వ్యూహాత్మక రీబ్యాలెన్స్
మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు, భయాందోళనలతో నిర్ణయాలు తీసుకోకండి. స్థిమితంగా మార్కెట్ ను పరిశీలించండి. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించండి. ఈ దిద్దుబాటును మీ పోర్ట్ ఫోలియో రీబ్యాలెన్సింగ్ కోసం అవకాశంగా ఉపయోగించడం. ఉదాహరణకు, మీ అస్సెట్ అలోకేషన్ లక్ష్యం 60% స్టాక్స్, 40% బాండ్లు అనుకుందాం. స్టాక్ మార్కెట్ (stock market) క్షీణత ఆ బ్యాలెన్స్ ను 50/50కి మార్చింది. తక్కువ ధరలకు ఎక్కువ స్టాక్స్ ను, అవికూడా సరైన అధ్యయనంతో, కొనుగోలు చేయడం ద్వారా, మార్కెట్ కోలుకున్నప్పుడు సంభావ్య లాభాల కోసం స్ట్రాటెజీలను రూపొందించుకోవచ్చు.
మీడియా డిటాక్స్
మార్కెట్ కరెక్షన్ సమయంలో, న్యూస్ చానెళ్లకు, ముఖ్యంగా బిజినెస్ న్యూస్ ఛానెళ్లకు దూరంగా ఉండండి. ఈ సమయంలో వాటిని చూస్తే, మీ భయాందోళనలు మరింత పెరుగుతాయి. దాంతో, మీ దీర్ఘకాలిక రాబడిని దెబ్బతీసే భావోద్వేగ ఆధారిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరెక్షన్ సమయాల్లో స్థిమితంతో, సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో ఫైనాన్షియల్ మార్కెట్ల గొప్ప చరిత్రను తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. గతంలో మార్కెట్ అస్థిరతల (stock market psychology) గురించి అధ్యయనం చేయడం ద్వారా, దశాబ్దాలుగా పెట్టుబడి ల్యాండ్ స్కేప్ ను తీర్చిదిద్దిన దీర్ఘకాలిక ధోరణులు, నమూనాలపై మీరు విలువైన సమాచారాన్ని పొందవచ్చు. ఇందుకు బర్టన్ మాల్కియెల్ రాసిన ‘ఎ ర్యాండమ్ వాక్ డౌన్ వాల్ స్ట్రీట్’ ను చదవండి.
పోర్ట్ ఫోలియో రిఫ్రెష్
మార్కెట్ దిద్దుబాటు సమయంలో పోర్ట్ ఫోలియో నాణ్యతను పెంచే అవకాశం లభిస్తుంది. మీ పెట్టుబడులు, మీ లక్ష్యాలు, మీ రిస్క్ టాలరెన్స్ కు అనుగుణంగా ఉన్నాయని మరోసారి నిర్ధారించుకోండి. మీ వ్యూహానికి సరిపోని హోల్డింగ్ లను గుర్తించండి. తక్కువ పనితీరు కనబరిచే లేదా అధిక విలువ కలిగిన ఆస్తులను విక్రయించడాన్ని పరిగణించండి. అదేవిధంగా, అధిక వాల్యుయేషన్ ల కారణంగా గతంలో అందుబాటులో లేని స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలను అన్వేషించండి. బలమైన, మరింత సహేతుకమైన పెట్టుబడితో మీ పోర్ట్ ఫోలియోను రీ డిజైన్ చేసుకోండి.
ఏమీ చేయకుండా ఉండండి..
ఇది మీకు అర్థవంతంగా అనిపించకపోవచ్చు. కానీ, మార్కెట్ దిద్దుబాటు సమయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలలో ఒకటి ఏమీ చేయకపోవడం. తిరోగమనం లేదా కరెక్షన్ల సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఓపికగా ఉన్నపెట్టుబడిదారులకు.. ఆ తరువాత మార్కెట్లు కోలుకున్నాక, మంచి రిటర్న్స్ లభిస్తాయని దశాబ్దాల మార్కెట్ చరిత్ర చూపించింది. వాస్తవానికి, గరిష్ట అనిశ్చితి సమయాల్లో ఆకర్షణీయమైన వాల్యుయేషన్లలో స్టాక్స్ కొనుగోలు చేయడానికి కొన్ని ఉత్తమ అవకాశాలు లభిస్తాయి.
లాంగ్ టర్మ్ లెన్స్
చివరగా, స్వల్పకాలిక మార్కెట్ కదలికలు మీ దీర్ఘకాలిక పెట్టుబడి కథలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే అని గుర్తుంచుకోండి. దిద్దుబాటు సమయంలో ఆందోళన చెందడం సహజమే అయినప్పటికీ, పైన వివరించిన విషయాలను దృష్టిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చారిత్రాత్మకంగా, స్టాక్ మార్కెట్ అనేక దిద్దుబాట్లను చూసినప్పటికీ దీర్ఘకాలంలో సానుకూల రాబడులను అందించింది.
టాపిక్