Air quality check: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్; మీ ప్రాంతంలోని వాయు నాణ్యతను కూడా తెలుసుకోవచ్చు..
Air quality check in Google Maps: ఢిల్లీ లో వాయు కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. అయితే, ఇతర ప్రధాన నగరాల్లో కూడా వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిల్లోనే ఉంది. మీ నగరం, లేదా మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకు మీరేం చేయాలంటే..
Air quality check in Google Maps: గూగుల్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ ఫీచర్ ను ప్రారంభించింది. దీని ద్వారా భారతదేశం అంతటా రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ డేటాను తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ చూడండి..
గూగుల్ మ్యాప్స్ తో..
గూగుల్ మ్యాప్స్ ద్వారా భారతదేశం అంతటా రియల్ టైమ్, హైపర్ లోకల్ ఎయిర్ క్వాలిటీ సమాచారాన్ని అందించే కొత్త టూల్ ‘ఎయిర్ వ్యూ’ ను గూగుల్ విడుదల చేసింది. వాయు కాలుష్యానికి సంబంధించిన సమస్యలను పర్యవేక్షించడానికిచ పరిష్కరించడానికి పౌరులు, స్థానిక అధికారులకు సహాయపడటానికి ఈ ఫీచర్ ను గూగుల్ ఈ వారం ప్రారంభంలో ప్రారంభించింది. క్షీణిస్తున్న ఏక్యూఐ లేదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేక భారతీయ నగరాల్లో, ముఖ్యంగా న్యూ ఢిల్లీ , దాని చుట్టుపక్కల ప్రాంతాలలో తీవ్రమైన సమస్యగా ఉంది.
ఢిల్లీలో దారుణం..
ఢిల్లీలో ఇటీవల పీఎం 2.5 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) క్యూబిక్ మీటర్ గాలికి 500 మైక్రోగ్రాములకు పైగా నమోదైంది. ఈ స్థాయి వాయు కాలుష్యం విషపూరితమైనదిగా వర్గీకరించబడింది. దాంతో, ప్రభుత్వం వాహనాల కదలికలు, నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. వర్చువల్ తరగతులకు మారాలని పాఠశాలలను ఆదేశించింది.
గూగుల్ ఎయిర్ వ్యూ ఎలా పనిచేస్తుంది?
ఎయిర్ వ్యూ భారత్ లోని ప్రధాన పట్టణ ప్రాంతాలతో సహా 150 కి పైగా నగరాల్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ సెన్సార్ల నెట్ వర్క్ ను ఉపయోగిస్తుంది. పీఎం2.5, పీఎం10, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను కొలవడానికి యుటిలిటీ పోల్స్, వాణిజ్య స్థలాలు, పరిపాలనా భవనాలపై ఈ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇవి ఉష్ణోగ్రత, గాలిలో తేమ వంటి ఇతర వాతావరణ పారామీటర్లను కూడా కొలవగలవు. ఈ సెన్సర్ల ద్వారా సేకరించిన డేటాను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలకు చెందిన పరిశోధకులు పరిశీలించి, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ను ఉపయోగించి విశ్లేషిస్తారు. ఈ సమాచారం మున్సిపల్ అధికారులతో పాటు పౌరులకు అందుబాటులో ఉంటుంది. అర్బన్ ప్లానర్లు కాలుష్య హాట్ స్పాట్ లను గుర్తించడానికి, ప్రాంతాల వారీగా పరిష్కారాలను వెతకడానికి ఈ డేటాను ఉపయోగించవచ్చు.
గూగుల్ మ్యాప్స్ లో ఇలా చూడండి..
వినియోగదారులు గూగుల్ మ్యాప్స్ లో 'ఎయిర్ క్వాలిటీ లేయర్' ఎంచుకోవడం ద్వారా లేదా 'వెదర్' విడ్జెట్ ను ఉపయోగించడం ద్వారా తమ ప్రాంతంలోని రియల్ టైమ్ వాయు నాణ్యత వివరాలను తెలుసుకోవచ్చు. గూగుల్ (GOOGLE) మ్యాప్స్ లోని 'ఎయిర్ క్వాలిటీ లేయర్' లో లేదా 'వెదర్' విడ్జెట్ లో మీరు కోరుకున్న ప్రాంతంలో ప్రస్తుత గాలి నాణ్యతను తెలుసుకోవడానికి ఆ ప్రాంతం పేరుపై ట్యాప్ చేయాలి. వాయు నాణ్యతను ముందే తెలుసుకోవడం ద్వారా మాస్క్ లు ధరించడం, ముందుగా ప్రణాళిక వేయడం, పిల్లలు, వృద్ధులను ఆయా ప్రాంతాలకు దూరంగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు.
టాపిక్