Google Maps: గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఫీచర్: ఇది ఎలా పని చేస్తుంది?
Google Maps: గూగుల్ తన ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ ఆటోకు విస్తరించింది. ఇప్పుడు డ్రైవర్లు తమ ప్రయాణ మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదాల గురించి నేరుగా తమ కారు లోని ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ నుండి గూగుల్ మ్యాప్స్ కు సమాచారం ఇవ్వవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
Google Maps: ఆండ్రాయిడ్ ఆటోలో ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఫీచర్ ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా డ్రైవర్లు తమ వాహనంలోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుండి తమ మార్గంలో జరిగిన ప్రమాదాలు, ఇతర రోడ్డు పరిస్థితులను గూగుల్ మ్యాప్స్ కు నివేదించడానికి వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా తాము ప్రయాణిస్తున్న మార్గంలో రాబోయే సమస్యల గురించి రియల్ టైమ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇతర వాహనదారులకు వీలు కలుగుతుంది.
నేరుగా రిపోర్ట్ చేయవచ్చు..
ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ లు, నిర్మాణ పనులు, గుంతలు లేదా శిథిలాలు వంటి వివిధ రహదారి సమస్యలను డ్రైవర్లు ఇప్పుడు త్వరగా నివేదించవచ్చు. అలా చేయడం ద్వారా, వారు విలువైన డేటాను అందిస్తారు. ఇది తోటి డ్రైవర్లకు ప్రమాదాలను నివారించుకోవడానికి, తదనుగుణంగా వారి మార్గాలలో మార్పులు చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఫీచర్ ఉపయోగాలు
యూజర్లు తమ కారులోని ఇన్ఫోటైన్ సిస్టమ్ లో ఆండ్రాయిడ్ (android) ఆటోను ఉపయోగిస్తున్నట్లయితే, వారు తమ ప్రయాణ మార్గానికి సంబంధించిన వివరాలను గూగుల్ మ్యాప్స్ కు నేరుగా నివేదించవచ్చు. ఇందుకు వారు గూగుల్ మ్యాప్స్ ఇంటర్ ఫేస్ లోని "రిపోర్ట్ ఇన్సిడెంట్" బటన్ ను నొక్కాలి. తరువాత, వారు సంఘటనకు సంబంధిత కేటగిరీని ఎంచుకోవచ్చు మరియు సమస్య యొక్క నిర్దిష్ట స్థానం మరియు తీవ్రతతో సహా అదనపు సమాచారాన్ని అందించవచ్చు. ఈ యూజర్ జనరేటెడ్ కంటెంట్ ఆ మార్గంలో వెళ్లే ఇతర వాహనదారులకు ఉపయోగపడుతుంది.
గూగుల్ మ్యాప్స్ లో ఒక సంఘటనను నివేదించడానికి దశలు
1. మొబైల్ డివైజ్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి.
2. గమ్యాన్ని నమోదు చేసి నావిగేషన్ ప్రారంభించండి. మ్యాప్ ను వీక్షించండి.
3. ఆండ్రాయిడ్ లో కుడివైపున ఉన్న '+' (యాడ్) ఐకాన్ ను ట్యాప్ చేయండి.
4. కింది భాగంలో ఉన్న 'రిపోర్ట్' బటన్ నొక్కండి.
5. యాక్సిడెంట్, స్పీడ్ ట్రాప్, రోడ్ క్లోజర్, ట్రాఫిక్ జామ్ లేదా ఇతర ప్రమాదాలు వంటి ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోండి.
6. మీ రిపోర్ట్ ను కన్ఫర్మ్ చేయండి. ఆపై సమాచారాన్ని ఇతర వినియోగదారులతో భాగస్వామ్యం చేయడానికి ‘సెండ్’ బటన్ నొక్కండి.
- మీరు పంపించిన తరువాత ఆ రిపోర్ట్ గూగుల్ మ్యాప్ లో కనిపిస్తుంది. అది ఇతర డ్రైవర్లు సురక్షితంగా నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది.
గూగుల్ మ్యాప్స్ కొత్త వార్నింగ్ సిస్టమ్
ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఫీచర్ తో పాటు, గూగుల్ మ్యాప్స్ మరో యూజ్ ఫుల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.పెద్ద సంఖ్యలో నకిలీ సమీక్షలు ఉన్న వ్యాపారాలను గుర్తించే లక్ష్యంతో కొత్త హెచ్చరిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ అసాధారణంగా ఎక్కువ సంఖ్యలో రివ్యూస్ ఉన్న బిజినెస్ లను గుర్తించి, యూజర్లను హెచ్చరిస్తుంది. అలాంటి బిజినెస్ ల గురించి ఆయా వ్యాపార ప్రొఫైల్స్ పై నోటిఫికేషన్ లను ప్రదర్శిస్తుంది. దాంతో, వినియోగదారులు తమ ఎంపికలను మరింత సమర్థవంతంగా నావిగేట్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్స్ (google maps) లో వార్నింగ్ కార్డ్ సిస్టమ్ ను లాంచ్ చేసింది. బిజినెస్ లిస్టింగ్ నుండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నకిలీ సమీక్షలు తొలగించినప్పుడు ఈ సిస్టమ్ వినియోగదారులకు తెలియజేస్తుంది. తొలుత యూకేలో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ యూఎస్ మార్కెట్లో కూడా కనిపించడం ప్రారంభించింది.