Ysrcp : కట్టడి లేదు, దిద్దుబాట్లు అసలే లేవు... గెలుపుపై ధీమా ఎలా…?
పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. తాడికొండ, దర్శి వంటి చోట మార్పులు ఖాయమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశమివ్వాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో శృతి మించుతున్న వారందరిని తప్పించడం సాధ్యమయ్యే పనేనా….. సిట్టింగులను తప్పిస్తే కొత్త వారికి ఎంత వరకు సహకరిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంద్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధుల్లో చాలామందిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలిచి తీరాలని ముఖ‌్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని సాధించిన వైఎస్సార్సీపీ అంతకు మించిన విజయాన్ని వచ్చే ఎన్నికల్లో నమోదు చేయడం సాధ్యమేనా అంటే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన వారెవ్వరికి అంత నమ్మకం ఉండకపోవచ్చు.
2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ సభ్యులు జగన్ ప్రభావంతోనే ఎన్నికల్లో గెలిచారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఇతర పార్టీల్లో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వారు, నియోజక వర్గాల్లో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన వారు కూడా 2019 ఎన్నికల్లో గెలవడానికి జగన్ ప్రభావం కారణమైంది. 151మంది ఎమ్మెల్యేలను గెలిపించుకన్న ధీమా, ధైర్యంతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరాలని జగన్ భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిది ధైర్యమా, అతి విశ్వసమా అనే సందేహాలు లేకపోలేదు.
ప్రజల్లో ముఖ్యమంత్రి పాలన పట్ల సానుకూలంగానే ఉన్నారని, ప్రజా ప్రతినిధుల తీరుపైనే అసంతృప్తిగా ఉన్నారని సమీక్ష సమావేశాల్లో తరచూ జగన్ చెబుతున్నారు. నిజానికి గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి వేర్వేరు బృందాలతో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. పనితీరు మార్చుకోని వారిని ఇంటికి పంపేయడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇందులో కొంత వరకు వాస్తవం లేకపోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారం నేరుగా ప్రభుత్వానికి తెలిసేలా కొత్త తరహా ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చింది. ప్రతి యాబై ఇళ్లకు ఓ వాలంటీరును బాధ్యుడ్ని చేసి సంక్షేమాన్ని, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు.
ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ పనైనా అయా శాఖలతో సంబంధం లేకుండా నేరుగా సచివాలయాల్లోనే అయిపోతుందని ప్రచారం చేశారు. వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నా, ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారం మాత్రం అయా సచివాలయాల పరిధిలో తెలిసిపోతుంది. ఏ పార్టీకి చెందిన ఓటర్లు ఎంతమంది అనే స్పష్టమైన అంచనా కూడా పక్కా లెక్కలతో తెలిసిపోతాయి. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలను గుర్తించడం కూడా సులువై పోతుంది. అదే సమయంలో ప్రజల మనసులో ఏముందో కూడా తెలుసుకోగలుగుతున్నారు. మొత్తం ఓటర్లలో 87శాతం మందికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నందున వారంతా తమకే ఓటేస్తారని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది.
ప్రభుత్వం చెబుతున్నట్లు అర్హులందరికి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతుంటే, జనమంతా సంతృప్తిగా ఉంటే 2019లో గెలిచిన వాళ్లంతా మళ్లీ అధికార పార్టీకి ఓటేయ్యాలి. కాని చాలా నియోజక వర్గాల్లో అలా జరగడం లేదు. ప్రభుత్వంతో ముడిపడిన పనిలో ప్రజా ప్రతినిధుల జోక్యం, అవినీతి మితిమీరిపోయాయనే విమర్శలున్నాయి.
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలని వేధింపులకు గురి చేయడం, లంచగొండితనం ప్రధాన సమస్యలుగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారిలో కాస్త సంతోషం ఉన్నా మిగిలిన వర్గాలలో ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు, పట్టణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త పన్ను వసూళ్లు, ఇసుక కొరత వీటన్నింటికి మించి టౌన్ ప్లానింగ్ అరాచకాలు జనంలో అసహనానికి కారణమవుతున్నాయి. ఐప్యాక్‌తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తోంది. మళ్లీ గెలవరనుకునే వారిని ఎలా తప్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలపై తొలినాళ్లలో ఉన్న ఆంక్షలు, నియంత్రణ ఆ తర్వాత క్రమేపి తొలగిపోయాయి. తమకు ఎలాంటి గుర్తింపు, పెత్తనం లేదని వాపోయిన ప్రజాప్రతినిధులు కాస్త అలుసివ్వగానే జనాన్ని పీల్చి పిండేశారు. ఇప్పుడు ఆ వ్యతిరేకత మొత్తం ప్రభుత్వానికి చుట్టుకుంది. దీంతో ఫిర్యాదులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పూర్తిగా పక్కన పెట్టేయాలని యోచిస్తోంది. అదే సమయంలో ఉన్న వారిని తొలగించి కొత్త వారిని ఎంపిక చేస్తే వారు ఎన్నికల్లో ఎంత మేరకు సహకరిస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి.
టాపిక్