Paytm shares: 5 శాతం పెరిగిన పేటీఎం షేర్లు: ఈ రికవరీకి కారణమేంటి? ఇది కొనసాగుతుందా?
Paytm shares: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వరుసగా మూడు సెషన్ల పాటు లోయర్ సర్క్యూట్లో ముగిసిన పేటీఎం షేర్లు మంగళవారం 5 శాతం లాభపడడం విశేషం.
Paytm crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో వరుసగా గత వారం గురు, శుక్ర వారాల్లో 20% లోయర్ సర్క్యూట్లో, ఈ వారంలో సోమవారం 10% లోయర్ సర్క్యూట్లో పేటీఎం షేర్లు ముగిశాయి. కాగా, ఫిబ్రవరి 6 మంగళవారం మాత్రం పేటీఎం షేర్లు 5 శాతం పెరగడం విశేషం. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కొత్త డిపాజిట్లను స్వీకరించకూడదని, క్రెడిట్ లావాదేవీలు నిర్వహించకూడదని ఆర్బీఐ నిషేధం విధించింది.
జియో ఫైనాన్షియల్స్ తీసుకోబోతోందా?
పేటీఎం షేర్లు ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 9.40 గంటలకు రూ.466 వద్ద ట్రేడయ్యాయి. ఫిబ్రవరి 5న పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు 10 శాతం నష్టపోయింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు రూ.761.4 నుంచి 41 శాతం నష్టపోయింది. కాగా, పేటీఎం (Paytm) వాలెట్ ను రిలయన్స్ గ్రూప్ కు చెందిన జియో ఫైనాన్షియల్స్ టేకోవర్ చేయబోతోందని వార్తలు ప్రారంభమయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలోనే పేటీఎం షేర్ల రికవరీ ప్రారంభమైందని భావిస్తున్నారు. అయితే, పేటీఎం వాలెట్ ను జియో ఫైనాన్షియల్స్ తీసుకోబోతోందని అటు పేటీఎం కానీ, ఇటు జియో ఫైనాన్షియల్స్ కానీ నిర్ధారించలేదు.
ప్రత్యామ్నాయాలు చూసుకోండి..
కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పేటీఎం ను వాడుతున్న వ్యాపారులు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలకు మారాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సూచించింది. ‘‘ పేటీఎంపై ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. అందువల్ల వినియోగదారులు తమ డబ్బులను రక్షించడానికి, ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం ఆర్థిక లావాదేవీలను కొనసాగించడానికి పేటీఎంకు బదులుగా ప్రత్యామ్యాయ యూపీఐ సేవలను పొందాలని సీఏఐటీ కోరింది. పెద్ద సంఖ్యలో చిన్న వ్యాపారులు, విక్రేతలు, హాకర్లు, మహిళలు పేటీఎం ద్వారా ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఏఐటీ ఈ సూచన చేసింది.
లే ఆఫ్స్ ఉండవు..
కాగా, ప్రస్తుత సంక్షోభంపై పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం లావాదేవీలు కొనసాగేలా చూస్తామని, అవసరమైతే, వేరే బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంటామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. తాజాగా, పేటీఎం సంస్థలో లే ఆఫ్స్ ఉండబోవని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆంక్షల తొలగింపు గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ‘‘సమస్య ఎక్కడ ప్రారంభమైందో కచ్చితంగా తెలియదు. త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి’’ అన్నారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం యాప్ పనిచేస్తుందని తెలిపారు.
టాపిక్