Kadapa Crime : కడప జిల్లాలో ఘోరం.. బాలికను బెదిరించి అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు
Kadapa Crime : కడప జిల్లాలో ఘోరం జరిగింది. బాలికను బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో చూపించి, బాలికను లొంగదీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. చింతకొమ్మదిన్నె రూరల్ సీఐ శంకర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతకొమ్మదిన్నె మండలంలోని ఒక తండాకు చెందిన 14 ఏళ్ల బాలికను లోబరుచుకోవాలని నిత్య పూజారి అనే యువకుడు యత్నించాడు. దీనికి పూజారి స్నేహితులు ఉదయ్ కిరణ్, రెడ్డి సహకరించారు. బాలికతో నిత్యపూజారి, ఉదయ్‌కిరణ్ మాట్లాడుతుండగా వారి స్నేహితుడు రెడ్డి సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.
స్థానికంగా నిత్యపూజారి కుటుంబానికి, బాలిక కుటుంబానికి మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఆ వీడియో ఇంట్లో వాళ్లకు చూపిస్తానని బాలికను బెదిరించారు. వీడియో చూపించకూడదంటే తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చారు. బ్లాక్‌మెయిలింగ్‌తో మూడు రోజుల కిందట బాలికపై నిత్యపూజారి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఉదయ్ కిరణ్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో.. వారు చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్ ఆశ్రయించారు. బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేశారు. నిందితులు ముగ్గురిపై చింతకొమ్మదిన్నె పోలీసులు గురువారం రాత్రి పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని చింతకొమ్మదిన్నె రూరల్ సీఐ శంకర్ నాయక్ తెలిపారు. ఈ కేసుపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్‌లు విచారణ ప్రారంభించారు. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అత్యాచారం, హత్య..
కడప జిల్లా కాశినాయన మండలంలో ఓ మహిళపై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. చాపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి చెన్నవరం-పాపిరెడ్డిపల్లె మధ్య చోటు చేసుకుంది. ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా ముఖంపై బండరాళ్లతో కొట్టి చంపేశారు. మహిళ మృతదేహాన్ని మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రపసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐ హనుమంతు, కొండారెడ్డి, క్లూస్ టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. మహిళ ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుందని అనుమానిస్తున్నారు. ఆమెకు భర్త, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)