Warangal Police: కొత్త కారుపై గీతలు, అసభ్య రాతలు..8మంది విద్యార్థులపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు
Warangal Police: స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల ఆకతాయి చేష్టలతో చిక్కుల్లో పడ్డారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉన్న కొత్త కారుపై గీతలు గీయడంతో, కారు యజమాని కుమార్తెను దూషిస్తూ అసభ్య రాతలు రాయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఈ ఘటన వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కలకలం సృష్టించింది.
Warangal Police: విద్యార్థుల ఆకతాయి చేష్టలతో చిక్కుల్లో పడిన ఘటన వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శృతి మించిన కొంటె చేష్టలతో కష్టాలు కొని తెచ్చుకున్నారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉన్నా కారుపై గీతలు గీసి, అసభ్యకరమైన రాతలు రాయడంతో కారుకు నష్టం వాటిల్లింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీస్ కానిస్టేబుల్ కారుపై గీతలు గీశారనే కారణంలో ఎనిమిది మంది స్కూల్ పిల్లలపై వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల కిందట ఈ ఘటన జరగగా.. కేసు నమోదైన విషయం చిన్నారుల కుటుంబ సభ్యులకు మంగళవారం తెలియడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కె.రాజు హనుమకొండ రాంనగర్ లోని రామ్ నగర్ టవర్స్ అపార్ట్మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్‌లో బోనాల పండుగ బందోబస్తు విధులు నిర్వహించేందుకు జులై 27, 28 తేదీల్లో రాజు వెళ్లాడు.
27వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో అదే అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్న చెందిన కొందరు చిన్నారులు స్టిల్ట్‌లో పార్క్ చేసిన రాజు కారు వద్దకు వచ్చారు. కారుపై గీతలు గీయడంతో పాటు ఆరో తరగతి చదువుతున్న రాజు కుమార్తెను తిడుతూ కొన్ని అక్షరాలు కూడా రాశారు. కారు డ్యామేజ్ కావడం, తన కూతురును బూతులు తిడుతూ రాతలు రాసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
కారు రిపేర్ కోసం ఇన్సురెన్స్ వర్తించేలా కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్టు 5వ తేదీన కానిస్టేబుల్ రాజు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న సుబేదారి పోలీసులు ఎనిమిది మంది చిన్నారులపై 324(5), 296(b), 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రెండు నెలల తరువాత వెలుగులోకి..
కానిస్టేబుల్ రాజు ఆగస్టు 5వ తేదీన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనంతరం కారు డ్యామేజ్ కు సంబంధించిన ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఘటన జరిగిన దాదాపు రెండు నెలలకు చిన్నారులపై కేసు నమోదైన విషయం నగరంలో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం సాయంత్రం సుబేదారి పోలీసుల నుంచి ఫోన్ రావడంతో కేసు నమోదైన విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దిక్కుతోచని పరిస్థితిలో వరంగల్ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. కారుపై గీతలు గీసిన కారణంతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన రెండు నెలలకు ఉద్దేశ పూర్వకంగానే వెలుగులోకి తీసుకువచ్చి, రాద్ధాంతం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారులు కారును పాడు చేయడానికి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే వారి మధ్య అంతర్గత వివాదాలు కారణమై ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ తరహా ఘటనల్లో ఇన్స్యూరెన్స్ వర్తింప చేయాలంటే ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి. చిన్నారులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై పోలీస్ ఉన్నత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇలాంటి ఘటనల్లో ఇరుపక్షాలు పరస్పరం రాజీకి వస్తే చట్టబద్దంగా కేసును ఉపసంహరించుకోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)