Warangal Murders: విడదీశారనే కోపంతోనే ఘాతుకం! దంపతుల హత్యతో వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఉద్రిక్తత
Warangal Murders: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో ఓ ప్రేమోన్మాది యువతి తల్లిదండ్రులను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి తల్వార్ తో యువతి కుటుంబ సభ్యులపై దాడి చేయగా, ఆమె తల్లిదండ్రులు స్పాట్ లోనే చనిపోయారు.
Warangal Murders: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తీసుకెళ్లిపోయారనే కోపంతో ఆమె తల్లిదండ్రుల్ని చంపేయడం రెండు జిల్లాల్లో ఉద్రిక్తతకు కారణమైంది. యువతితో పాటు ఆమె తమ్ముడు తీవ్ర గాయాలతో హనుమకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను నిర్ధాక్షిణ్యంగా విడదీశారనే కారణంతోనే నాగరాజు అనే యువకుడు ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
దంపతుల హత్య నేపథ్యంలో వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారి తరఫు బంధువులు పెట్రోల్ డబ్బాలతో ఆందోళనకు దిగగా.. హంతకుడికి సహకరించాడంటూ నాగరాజు స్నేహితుడిపై ఆయన స్వగ్రామంలో బాధిత కుటుంబ బంధువులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇటు వరంగల్ జిల్లా, అటు మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హత్యల వెనుక అసలేం జరిగింది..?
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తండాకు చెందిన బానోతు శ్రీను–సుగుణ భార్యాభర్తలు. వారికి బానోతు దీపిక(దివ్య) అనే కూతురు, మదన్ లాల్ అనే కొడుకు ఉన్నాడు. దీపిక హనుమకొండలోని ఓ కాలేజీ డిగ్రీ చదువుతుండగా, ఆమెకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు అలియాస్ బన్నీతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరి అది కాస్త ప్రేమగా మారింది. దీంతో 2023 అక్టోబర్ నెలలో ప్రేమ వివాహనం చేసుకున్నారు.
కాలేజీలో చదువుతున్న తమ బిడ్డ కనిపించకపోవడంతో దీపిక తండ్రి బానోతు శ్రీను సుబేదారి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు నాగరాజు, దీపికను పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మేజర్ కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగా, వారు హైదరాబాదులో ఉంటున్నారు. ఇదిలాఉంటే కొద్దిరోజులకు దీపిక తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పుకుని తమ స్వగ్రామం 16 చింతల తండాకు తీసుకొని వచ్చారు.
కోపంతో హత్యకు ప్లాన్
దీపికను తమ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ ఏడాది జనవరిలో పెద్దల సమక్షంలో ఇరుకుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. ఆ తరువాత పంచాయితీ తీర్మానం మేరకు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఇదిలాఉంటే ప్రేమించి, పెళ్లి చేసుకుని ఉంటున్న తమను విడదీశారని దీపిక తల్లిదండ్రులపై నాగరాజు కసి పెంచుకున్నాడు.
తమను విడ దీసిన దీపిక తల్లిదండ్రులను ఎలాగైన హతమర్చాలని నిర్ణయించుకున్నాడు. తన పథకంలో భాగంగా బుధవారం అర్ధరాత్రి 2 గంటల సుమారులో ముందుగా తాను సమకూర్చుకున్న వేట కొడవలితో 16 చింతల తండాకు చేరుకున్నాడు. నేరుగా దీపిక ఇంటికి వెళ్లగా, అక్కడ ఇంటి ముందు దీపిక, ఆమె తల్లి సుగుణ ఒక మంచంలో పడుకుని ఉన్నారు. తండ్రి శ్రీను మరో మంచంలో పడుకోగా, ఆమె తమ్ముడు మదన్ లాల్ ఇంట్లో నిద్రిస్తున్నాడు.
నాగరాజు పడుకున్న దీపికను లేపగా, ఆమె కేకలు వేయడంతో తల్లి సుగుణ లేచింది. ఇక కోపొద్రిక్తుడైన నాగరాజు తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో సుగుణపై దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా, ఆ కేకలు విని తండ్రి శ్రీను లేచి, ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆయనను కూడా కిరాతకంగా నరకడంతో శ్రీను అక్కడికక్కడే కుప్పకూలాడు.
ఈ ఘర్షణతో నిద్ర లేచిన మదన్ లాల్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో అతడిపైనా నాగరాజు దాడి చేయడంతో దవడ భాగంలో తీవ్ర గాయమైంది. దీపిక చేతులు, మెడ భాగంలో కూడా గాయాలయ్యాయి. దీంతో వారంతా కేకలు వేయడంతో నాగరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీనును ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
హనుమకొండ ఆసుపత్రిలో దీపిక, మదన్ లాల్
తీవ్ర గాయాలపాలైన దీపక, మదన్ లాల్ ను హనుమకొండలోని చక్రవర్తి ఆసుపత్రికి తరలించారు. దీపికకు మెడ దగ్గర కత్తిగాట్లు ఉండగా, ఆమె సోదరుడు మదన్ లాల్ కు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో తాత్కాలికంగా చికిత్స అందించిన అక్కడి డాక్టర్లు తల్లిదండ్రుల అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక వాహనంలో నర్సంపేటకు పంపించారు. తల్లిదండ్రుల శవాలను చూసిన దీపిక బోరున విలపించింది. మదన్ లాల్ కనీసం నోరు తెరవలేని స్థితిలో ఉండగా, పేరెంట్స్ డెడ్ బాడీలను చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
నాగరాజు స్నేహితుడిపై దాడి
ఇద్దరిని హత్య చేసిన నాగరాజు స్వగ్రామం గూడూరు మండలం గుండెంగా గ్రామం కాగా, అతడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు, దీపిక బంధువులైన తండావాసులు డిమాండ్ చేశారు. శ్రీను, సుగుణ హత్యకు నాగరాజు మిత్రుడు పవన్ ను సహకరించాడని అనుమానంతో గుండెంగ తండావాసులు ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు పవన్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసుల రక్షణ వలయంలో పవన్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండెంగ గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలో వ్యాపార దుకాణాలు బంద్ చేయించారు. కాగా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎప్పటికప్పుడు సంఘటన పై ఆరా తీస్తూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆందోళన
నర్సంపేట మార్చురీలో 16 చింతలతండా దంపతుల మృతదేహాలు ఉండగా, మృతుల బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుల బంధువులు నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. కాగా నిందుతుడిని తమకు అప్పగించిన తరువాతే పోస్టుమార్టం నిర్వహించాలంటూ బంధువుల నిరసన చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితుడు!
పోలీస్ విచారణలో భాగంగా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ చంద్రమోహన్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సందర్శించారు. తీవ్ర గాయాలపాలైన దీపిక, మదన్ లాల్ ను పరామర్శించారు. కాగా ఉన్మాదంతో హత్యలకు పాల్పడిన నాగరాజును పోలీసులు గుండెంగ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీపీ రవీందర్ కూడా ధ్రువీకరించారు.
నిందితుడు హత్యకు ఉపయోగించిన వేట కొడవలితో పాటు మర్డర్ కు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలాఉంటే నర్సంపేట మార్చురీలో పోస్టుమార్టం అనంతరం శ్రీను, సుగుణ డెడ్ బాడీలను వారి స్వగ్రామం 16చింతల తండాకు తరలించగా, గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా దీపిక ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపగా, ఇటు 16 చింతలతండా, అటు గుండెంగ గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)