Warangal : 19న వరంగల్‌కు రేవంత్ రెడ్డి.. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ
Warangal : సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించబోయే ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. హనుమకొండ బాల సముద్రంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నారు. అదే రోజు మహిళా స్వయం సహాయక సంఘాలు, జిల్లా సమైఖ్య సభ్యులు, గ్రామ సమైఖ్య సభ్యులకు వివిధ శాఖల వారీగా పలు రకాల ఆస్తులను పంపిణీ చేయనున్నారు.
సీఎం పర్యటనపై రివ్యూ..
ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్‌లోని సచివాలయంలో రివ్యూ చేశారు. వరంగల్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. రూట్ మ్యాప్, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సమీక్షించారు.
ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను దిగ్విజయం చేయాలని కోరారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కొండా సురేఖ అధికారులకు సూచించారు.
సమన్వయంతో పని చేయాలి..
మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విజువల్స్ ద్వారా అవగాహన కల్పించాలని.. వేం నరేందర్‌రెడ్డి సూచించారు. గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. 19న వరంగల్‌లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, ప్రజా పాలన విజయోత్సవ సభ గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏడాది కాలంలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిపారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్, హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)