Social Media Cases: సోషల్ మీడియా కేసులపై జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరణ.. పిల్‌కు విచారణార్హత లేదన్న సీజే
Social Media Cases: ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిలవురించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై చీఫ్ జస్టిస్ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చని భావిస్తున్నారని, వీటిని ఉపేక్షించలేమని, పిల్‌కు విచారణార్హత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
Social Media Cases: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో జోక్యం చేసుకోడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. మూకుమ్మడిగా వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారంటూ విజయబాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో కొందరు న్యాయమూర్తులను కోర్టు తీర్పులను కూడా దూషిస్తున్నారని ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సరి కాదన్నారు.
సామాజిక మాధ్యమాల్లో కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న పిటిషనర్ విజయబాబుపై అసహనం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు. ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. పోలీసులు నమోదు చేస్తున్న కేసులపై పిల్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
పోలీసుల చర్యల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారు నేరుగా న్యాయ స్థానాలను ఆశ్రయించవచ్చని, మొత్తం పోలీసు చర్యల్ని నిలిపివేయాలని కోరడంలో ఆంతర్యం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. సోషల్ మీడియా కార్యకర్తలు గతంలో న్యాయమూర్తులను ఎలా దూషించారో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. ఈ తరహా ఘటనల్లో పిల్స్ దాఖలు చేయడంలో ఆంతర్యం ఏమిటని పిటిషనర్‌ను నిలదీసింది.
సోషల్ మీడియాలో కొందరు తమను తాము ఏమైనా చేయగలమని భావిస్తున్నారని, అలాంటి చర్యల్ని ఉపేక్షించలేమన్నారు. పోలీసుల చర్యలు నొప్పించి ఉంటే వారికి తగిన వేదికలను న్యాయం కోసం అభ్యర్థించవచ్చని పిల్స్ పరిష్కారం కాదన్నారు. కొంతమంది జడ్జిలపై కూడా కామెంట్లు చేయడాన్ని హైకోర్టు సీజే ధర్మాసనం ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది.