Konda Surekha : కొండా సురేఖపై ఆరుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు.. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి భూపాలపల్లి వరకూ ఇదే తీరు!
Konda Surekha : మంత్రి కొండా సురేఖ మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆమెపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు సురేఖపై పార్టీకి ఫిర్యాదు చేసినట్టు చర్చ జరుగుతోంది. తమ నియోజకవర్గాల్లో సురేఖ జోక్యం ఎక్కువవుతోందని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
మంత్రి కొండా సురేఖపై సొంత జిల్లా.. సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ వివాదాలు, గొడవల నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సురేఖ తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. ఆమె కారణంగానే గొడవలు, వివాదాలు జరుగుతున్నట్టు పార్టీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ.. ఇతర నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను హైదరాబాద్‌లో కలిశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ వ్యవహార శైలిని మున్షీ, టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లినట్లు.. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. మంత్రి కొండా సురేఖ తమకు తెలియకుండానే నియోజకవర్గాల పర్యటనకు వస్తున్నారని, ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదని ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇలాంటి సమయాల్లోనే కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పార్టీకి ఫిర్యాదు చేశారు.
నామినేటెడ్ పోస్టుల విషయంపైనా ఫిర్యాదులు చేసినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివరించారు. జిల్లా, మండల స్థాయి నామినేటెడ్ పోస్టులను కూడా తన వర్గం వారికే ఇప్పించుకుంటున్నారని.. పార్టీ విజయానికి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇప్పించుకోలేకపోతున్నామని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్పారు. తమ నియోజకవర్గాల్లో ఎవరికి ఏ పదవి వస్తుందో.. వచ్చే వరకు తమకు కూడా తెలియడం లేదని వాపోయారు.
జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లోనూ మంత్రి తమతో సంప్రదింపులు జరపడం లేదని ఎమ్మెల్యేలు పార్టీకి ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం జరుగుతుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని.. వెంటనే జిల్లా రాజకీయాలపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని దీపాదాస్ మున్షీ, మహేశ్ కుమార్ గౌడ్‌ను కోరినట్టు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పారు.
ఇటీవల ఆటోలో గీసుకొండ స్టేషన్‌కు వచ్చిన సురేఖ.. అరెస్టు చేసిన తమ అనుచరులను బయటకు పంపాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్ లో లాకప్ వద్ద ఎస్సై కుర్చీలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి అనుచరుల అరెస్టుతో వరంగల్- నర్సంపేట రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై పార్టీ కూడా సీరియస్ అయినట్టు తెలిసింది.