Post Office Scheme : రోజుకు రూ.100 పెట్టుబడితో రూ.2.14 లక్షల రాబడి, పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్
Post Office Scheme : చిన్న మొత్తాల్లో పొదుపునకు పోస్టాఫీసుల్లో చక్కటి పథకం అందుబాటులో ఉంది. రోజులు రూ.100 ఆదా చేస్తే రూ.లక్షల్లో తిరిగి పొందవచ్చు. ఈ పథకమే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం. ఈ స్కీమ్ లో వార్షిక వడ్డీ 6.7 శాతం పొందవచ్చు. ఐదేళ్ల పాటు పొదుపు చేసుకోవచ్చు.
నేటి పొదుపు రేపటి భవిష్యత్తు. చిన్న మొత్తమైన సరే పొదుపు తప్పనిసరి అని ఆర్థిక సూత్రాలు చెబుతున్నాయి. ఇవాళ మనం దాచే రూపాయి... రేపటి మన అవసరాలకు అండగా నిలుస్తుంది. భవిష్యత్తు ఆలోచన చేసేవారికి పెట్టుబడి చాలా ముఖ్యం. మీరు పెద్ద పెట్టుబడులు చేయలేకపోతే, చిన్న మొత్తాలలో ఆదా చేసుకోవచ్చు. మీ ఊరిలోనే మీకు అందుబాటులో ఉన్న పోస్టాఫీసులో చక్కటి పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు ఎంతో కొంత చొప్పున సేవ్ చేసుకుంటే మీ భవిష్యత్ అవసరాలకు ఢోకా ఉండదు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖలో మీ డబ్బు భద్రంగా ఉంటుంది.
రోజుకు రూ.100 ఆదాతో లక్షలు
పోస్టాఫీసుల్లో ఎన్నో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒకటి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో రోజుకు రూ.100 చొప్పున పొదుపు చేసుకోవడంతో క్రమేణా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మీరు ప్రతిరోజూ కేవలం రూ. 100 ఆదా చేస్తే అది నెలకు రూ. 3000 ఏడాది రూ. 36,000లకు చేరుతుంది. ఇలా 5 సంవత్సరాల పాటు ఆదా చేస్తే మొత్తం డిపాజిట్ రూ. 1,80,000 అవుతుంది. ఈ పథకం కింద కేంద్రం వార్షిక వడ్డీ రేటు 6.7% అందిస్తుంది. 5 సంవత్సరాలలో మీరు సుమారు రూ. 34,097 వడ్డీని పొందవచ్చు. అంటే మీరు వడ్డీతో కలిసి ఐదేళ్లకు మొత్తం రూ. 2,14,097 అందుకుంటారు.
50 శాతం లోన్ సదుపాయం
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో అత్యవసర సమయాల్లో మీరు రుణం కూడా పొందవచ్చు. మీరు కనీసం 12 వాయిదాలు చెల్లిస్తే మీ డిపాజిట్ మొత్తంలో 50% వరకు లోన్ పొందవచ్చు. అయితే ఈ లోన్ పై వడ్డీ రేటు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే 2% ఎక్కువగా ఉంటుంది. ఈ రుణాన్ని మీరు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. మీరు ఐదేళ్ల తర్వాత కూడా ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మరో ఐదేళ్లకు మీ మొత్తానికి మునుపటిలాగే వడ్డీ చెల్లిస్తారు. అలాగే పొడిగించుకున్న ఖాతాను మీకు ఇష్టవచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. తక్కువ కాలంలో ఖాతాను క్లోజ్ చేస్తే వడ్డీలో మార్పులు ఉంటాయి. మీ ఖాతాను 3 సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. అయితే మెచ్యూరిటీకి ముందు ఖాతా క్లోజ్ చేస్తే వడ్డీ పొదుపు ఖాతా(4 శాతం) ప్రకారం ఇస్తారు.
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. ఐదేళ్ల టెన్యూర్‌తోనే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని వడ్డీ రేటు 6.70 శాతంగా ఉండి. వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. గతేడాది ఈ స్కీమ్ వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. నెలనెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడితో మెచ్యూరిటీ సమయలో పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది. కనీసం రూ.100 పెట్టుబడితో ఈ పథకంలో చేరవచ్చు. తర్వాత 100 రెట్టింపు లెక్కన ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ లో ఇండివిడ్యువల్‌గా లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు చేరవచ్చు.
రూ.5 వేల పెట్టుబడితో
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ లో ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ 6.7 శాతం ప్రకారం ఐదేళ్లకు రూ. 56,830 వడ్డీ అందుకుంటారు. వడ్డీతో కలిపి ఐదేళ్లకు రూ. 3,56,830 అందుతుంది. అకౌంట్ ను మరో ఐదేళ్లు పొడిగిస్తే పదేళ్ల మెచ్యూరిటీకి రూ. 2,54,272 జోడించి మొత్తం రూ. 8,54,272 వస్తుంది. కస్టమర్ ప్రతి నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెడితే పదేళ్లకు రూ. 17,08,546 అందుకుంటారు. వడ్డీనే రూ.5 లక్షలకు పైగా వస్తుంది.
Disclaimer : ఈ ఆర్టికల్ లోని సమాచారం ఇంటర్నెట్ ఆధారితం. పెట్టుబడి అంశాలను నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఈ సమాచారం హెచ్.టి.తెలుగు అభిప్రాయం కాదు.
సంబంధిత కథనం