Palair Reservoir : వెలవెలబోతున్న పాలేరు రిజర్వాయర్, 12 అడుగులకు తగ్గిన నీటి మట్టం-khammam news in telugu palair reservoir water levels decreasing day by day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Palair Reservoir : వెలవెలబోతున్న పాలేరు రిజర్వాయర్, 12 అడుగులకు తగ్గిన నీటి మట్టం

Palair Reservoir : వెలవెలబోతున్న పాలేరు రిజర్వాయర్, 12 అడుగులకు తగ్గిన నీటి మట్టం

HT Telugu Desk HT Telugu
Jan 29, 2024 07:22 PM IST

Palair Reservoir : నిత్యం మూడు జిల్లాలకు తాగు నీటిని అందించే పాలేరు రిజర్వాయర్ లో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతుంది. రిజర్వాయర్ లో నీటిమట్టం 12 అడుగులకు పడిపోయింది. నాగార్జున సాగర్ నుంచి జలాలు చేరకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారు.

పాలేరు రిజర్వాయర్
పాలేరు రిజర్వాయర్

Palair Reservoir : ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ లో నీటి మట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. నిండు కుండలా కనిపించే పాలేరు జలాశయంలో నీరు గణనీయంగా తగ్గిపోతుండటం అధికారులతో పాటు జిల్లా ప్రజలనూ కలవరానికి గురిచేస్తోంది. రిజర్వాయర్ కు కొంత కాలంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి జలాలు చేరకపోవడం, ఉన్న నీటిని తాగు నీటి అవసరాలకు వినియోగిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటమట్టం 20 అడుగులు కాగా తాజాగా 12 అడుగులకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రానురాను ఇది మరింత తగ్గుతున్న పరిస్థితితో సాగు అవసరాలకే కాదు.. తాగునీటికీ ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. నిత్యం మూడు జిల్లాలకు తాగు నీటిని పాలేరు రిజర్వాయర్ ద్వారా తరలిస్తున్నారు.

మూడు జిల్లాలకు తాగునీటి సరఫరా

ప్రతి రోజూ 125.60 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పాటు పాలేరు డీఫ్లోరైడ్ ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచే ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రతిఏటా నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదు. కానీ ఈ ఏడాది వర్షాకాలం కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో సాగర్ ప్రాజెక్టులో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఫలితంగా దిగువకు నీటిని వదిలే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో పాలేరు రిజర్వాయర్ లో ఇప్పటి వరకు ఉన్న నీటి నిల్వనే తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇకనైనా సాగర్ నుంచి నీరు విడుదల చేయకపోతే నీటి మట్టం కొద్ది రోజుల్లోనే మరింత తగ్గిపోయి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితి తలెత్తితే తాగునీటి పథకాలకు కూడా నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండదు.

తక్షణం 1.5 టీఎంసీలు ఇస్తేనే..

పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం గణనీయంగా తగ్గినందున ఇప్పటికిప్పుడు 1.5 టీఎంసీల నీరు విడుదల చేస్తేనే తాగునీటి అవసరాలు తీరే అవకాశముంది. అలాగే వేసవి ఎండలు విపరీతంగా ఉండే ఏప్రిల్ నెలలో మరో 1.5 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో పాలేరు రిజర్వాయర్ నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. పరిస్థితి ఇలా ఉంటే యాసంగి పంటగా పాలేరు కాలువ పరిధి రైతులు పలువురు వరి సాగు మొదలు పెట్టారు. గతంలో రిజర్వాయర్ లో నీరు తగ్గినా పాలేరు కాల్వ కింద పంటలకు విడుదల చేసేవారు. ఈసారి కూడా అదే ధైర్యంతో రైతులు వరి నాట్లు వేశారు. ఈ నేపథ్యంలో కనీసం నాలుగైదు తడులన్నా సాగు నీరు అందించాలని వారు దయనీయంగా వేడుకుంటున్నారు. పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించగా పరిస్థితిని చక్కదిద్ది సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని అభయమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్ కు శ్రీరాం సాగర్ నీరు చేరే అవకాశం లేనందున సాగర్ జలాలే విడుదల చేయాల్సి ఉంటుందని సమాచారం. ఇక పాలేరు కాల్వకు సాగునీటి విడుదలపై ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

IPL_Entry_Point