RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..
RCB vs CSK IPL 2024: ప్లేఆఫ్స్ డిసైడర్ మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్‍లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‍లో మంచి స్కోరు చేసింది. డుప్లెసిస్ హఫ్ సెంచరీ చేస్తే.. కోహ్లీ, పాటిదార్ దూకుడైన బ్యాటింగ్‍తో అదరగొట్టారు. చెన్నైకు దీటైన టార్గెట్ ఇచ్చింది.
RCB vs CSK IPL 2024: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన తన చివరి లీగ్ మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్‍లో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఆర్సీబీ మంచి స్కోరు చేసింది. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో నేడు (మే 18) జరుగుతున్న మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే బెంగళూరు తప్పకుండా కనీసం 18 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలువాలి. 201 పరుగులు అంత కంటే ఎక్కువ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
విరాట్, డుప్లెసిస్ మెరుపులు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఓపెనర్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 47 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆరంభంలో మెరుపులు మెరిపిస్తే.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (39 బంతుల్లో 54 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శకతంతో దుమ్మురేపాడు. ఆరంభం విరాట్ భారీ హిట్టింగ్ చేశాడు. కాసేపు వర్షం పడినా మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఆ తర్వాత కాసేపు నెమ్మదించినా ఆ తర్వాత విరాట్ మళ్లీ దూకుడు పెంచాడు. అయితే, 10వ ఓవర్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‍లో విరాట్ కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచౌట్ అయ్యాడు. దీంతో 78 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. కోహ్లీ ఔటైనా డుప్లెసిస్ చెలరేగాడు. 35 బంతుల్లో అర్ధ శకతం చేశాడు. అయితే, దురదృష్టకరంగా నాన్ స్ట్రయికర్ ఎండ్‍లో రనౌట్ అయి నిరాశగా వెనుదిరిగాడు.
పాటిదార్, గ్రీన్ ధనాధన్
డుప్లెసిస్ ఔటైనా రజత్ పాటిదార్ భారీ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. 23 బంతుల్లోనే 41 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెరిపించాడు. పాటిదార్ దుమ్మురేపటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, 18వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‍లో పాటిదార్ క్యాచ్ ఔటయ్యాడు. మరోవైపు కామెరూన్ గ్రీన్ కూడా సత్తాచాటాడు. ఈ సీజన్‍లో అంతగా ఫామ్ లేకపోయినా కీలక మ్యాచ్ గ్రీన్ అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 14 పరుగులు) ఉన్నంత సేపు అదరగొట్టాడు. గ్లెన్ మ్సాక్స్‌వెల్ (5 బంతుల్లో 16 పరుగులు) చివర్లో 2 పోర్లు, ఓ సిక్స్‌తో దూకుడుగా ఆడి కీలక రన్స్ చేశాడు. మొత్తంగా బెంగళూరు 218 పరుగుల మంచి స్కోరు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసినా.. 4 ఓవర్లలో 61 పరుగులు సమర్పించాడు. తుషార్ దేశ్‍పాండే, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీశారు.
ప్లేఆఫ్స్ చేరాలంటే..
ఐపీఎల్ సీజన్ 2024 ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‍లో 18 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవాలి. అంటే చెన్నైను 200 పరుగులు అంత కంటే తక్కువకే పరిమితం చేయాలి. ఒకవేళ బెంగళూరు ఈ మ్యాచ్ ఓడినా.. 18 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలిచినా.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుతుంది. అంటే చెన్నై 201 అంతకంటే ఎక్కువ రన్స్ చేస్తే ప్లేఆఫ్స్ వెళుతుంది.