‌HT Effect: CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..-property tax collection in vijayawada postponed for three months cms key decision in wake of floods ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ‌Ht Effect: Cm కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..

‌HT Effect: CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 18, 2024 06:43 AM IST

‌HT Effect: ఓ వైపు వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆస్తి పన్ను చెల్లించాలంటూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేయడంపై హిందుస్తాన్ టైమ్స్‌ కథనానికి సిఎంఓ స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పన్నుల చెల్లింపుకు మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

వరద బాధితులకు పన్ను చెల్లింపుల్లో ఉపశమనం
వరద బాధితులకు పన్ను చెల్లింపుల్లో ఉపశమనం

HT Effect: బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజల బాధల్ని పట్టించుకోకుండా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నెలాఖర్లోగా ఆస్తి పన్నులు చెల్లించాలని హెచ్చరించడంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విజయవాడ నగరంలో దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలు వరద ముంపుకు గురయ్యాయి. వీరిలో కనీసం లక్షన్నర కుటుంబాలు తీవ్రంగా వరద నష్టాన్ని ఎదుర్కొన్నాయి. దాదాపు పది రోజులు వరద ముంపులో కట్టుబట్టలతో మునిగిన ప్రజలకు విఎంసి హెచ్చరికలు ఆందోళనకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ హెచ్చరికలపై హిందుస్తాన్ టైమ్స్‌ కథనానికి ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆస్తి పన్ను వసూళ్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పన్ను వసూళ్లను తాత్కలికంగా నిలిపివేశారు.

విజయవాడలో నెలకొన్న వరద పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటం, వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన 32 డివిజన్‌లలో మూడు నెలల పాటు పన్ను వసూళ్లు వాయిదా వేశారు. నగరంలోని 1, 5,7,15,16,17,18,19, 20,21,22,30, 32, 40, 41,42,43,44, 45,46,47,54,55, 56,57,58, 59, 60,61,62,63,64 డివిజన్లలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో మూడు నెలల పాటు ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ తదితర పన్నుల వసూళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఏం జరిగిందంటే…

విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి నగరంలోని 32 డివిజనల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. పది రోజుల పాటు వరద ముంపులో చిక్కుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆదివారం జారీ చేసిన ప్రకటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వరద బాధితులపై ఏమాత్రం సానుభూతి లేకుండా సెప్టెంబర్ 30వ తేదీలోగా పన్ను బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు జారీ చేయడంపై ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులంతా తమ తమ ఆస్తి పన్ను, మంచి నీటి కుళాయి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, వాటర్ మీటర్ చార్జీలు, ఖాళీ స్థలముల పన్నులను మొదటి అర్ధ సంవత్సరానికి సెప్టెంబర్‌ 30వ తేదీలోగా చెల్లించాలని ఆదివారం నగర పాలక సంస్థ ప్రకటించింది. 30వ తేదీలోపు పన్ను చెల్లించకపోతే జరిమానాలు ఉంటాయని, నగరంలోని 3 సర్కిల్ కార్యాలయాల్లో , విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పన్నులు చెల్లించాని పేర్కొన్నారు.

ఎటు చూసినా కన్నీళ్లే….

విజయవాడ నగరంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో లక్షలాది మంది కట్టుబట్టలతో మిగిలారు. ఒక అంతస్తులోపు ఉన్న భవనాలు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లలో ఉంటున్న వారికి కట్టుబట్టలు మినహా ఏమి మిగల్లేదు. సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉండగా వరద ముంచెత్తడం ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఎవరికి ఏమి మిగలకుండా పోయింది.

ఈ క్రమంలో నగర పాలక సంస్థ పన్ను బకాయిల కోసం ప్రకటనలు ఇవ్వడం వరద బాధితుల్లో ఆగ్రహానికి కారణమైంది. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా, 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తూ ప్రకటనలు విడుదల చేయడంపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విజయవాడ నగరంలో 32 డివిజన్లలో దాదాపు 2,70,000 కుటుంబాలకు పైగా వరద ముంపుకు గురయ్యారు. వీరిలో కనీసం లక్షన్నర కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండే అల్పాదాయ వర్గాలకు చెందిన వారే ఉంటారు. దాదాపు 8 లక్షల మంది జనాభా వరదల్లో నీట మునిగి సర్వస్వం కోల్పోయారు. ఉపాధి లేక, వస్తువులు, వాహనాలు పాడైపోయి దుర్బర పరిస్థితులలో వేలాదిమంది చిక్కుకున్నారు. వేతన జీవులు మినహా అసంఘటిత రంగంలో ఉపాధి పొందే వారి పరిస్థితి ఘోరంగా ఉంది.

వరద ముప్పును హెచ్చరించడంలో విఫలమైన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పన్ను వసూళ్ల విషయంలో మాత్రం ప్రకటనలివ్వడంపై వరద బాధితుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విజయవాడలో వరద నష్టం తీవ్రత పెరగడానికి ప్రజలను ఏమాత్రం అప్రమత్తం చేయని వ్యవస్థల వైఫల్యమే ఎక్కువగా ఉంది. బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో పన్నులు చెల్లించకపోతెే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తూ ప్రకటనలు జారీ చేయడంపై ప్రజల్లో నిరసన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన సీఎం పన్ను వసూళ్లు వాయిదా వేయాలని అధికారుల్ని ఆదేశించారు.