Khammam Rains : భారీ వర్షాలు - మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉద్ధృతి, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్..!
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. శనివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో మళ్లీ మున్నేరు వాగులో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు హెచ్చరికలను(రెడ్ అలర్ట్) జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.
దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… ఖమ్మం వెళ్లారు.
జాగ్రత్తగా ఉండాలి - జిల్లా కలెక్టర్
తాజా పరిస్థితులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐఎండీ సూచనల ప్రకారం… జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇండ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. అత్యవసరమైన పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1077ను సంప్రదించాలని సూచించారు.