Flesh eating bacteria: నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా మనిషిని తినేస్తుంది, రెండు రోజుల్లోనే ప్రాణం తీసేస్తుంది జాగ్రత్త-beware this bacteria in water can eat a person and kill them within two days ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flesh Eating Bacteria: నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా మనిషిని తినేస్తుంది, రెండు రోజుల్లోనే ప్రాణం తీసేస్తుంది జాగ్రత్త

Flesh eating bacteria: నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా మనిషిని తినేస్తుంది, రెండు రోజుల్లోనే ప్రాణం తీసేస్తుంది జాగ్రత్త

Haritha Chappa HT Telugu
Jun 16, 2024 11:48 AM IST

Flesh eating bacteria: అరుదైన బ్యాక్టీరియా వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా నీటిలో మాత్రమే ఉంటుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.

మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా
మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా

Flesh eating bacteria: జపాన్లో ప్రజలు స్విమ్మింగ్ పూల్ లో దిగాలన్నా, నదిలో ఈత కొట్టాలన్నా భయంతో వణికి పోతున్నారు. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా నీటిలో ఉండడమే దీనికి కారణం. అది ఏ నీటిలో ఉంటుందో అంచనా వేయడం కష్టమే. ఆ బ్యాక్టీరియా శరీరంలో చేరి స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి కారణం అవుతుంది. ఇది శరీరంలో చేరాక కేవలం రెండు రోజుల్లోనే ప్రాణాలు తీసేస్తుంది. జపాన్ దేశంలో ఈ ఏడాది ఈ బ్యాక్టీరియా వల్ల 977 మంది ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జపాన్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

మాంసం తినే బ్యాక్టిరియా

ఇది పిల్లలకు కూడా చాలా సులువుగా సోకుతుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఈ బ్యాక్టీరియా శరీరంలో సులువుగా నీటి ద్వారా చేరిపోతుంది. ఎక్కువగా కలుషిత నీళ్లున్న స్విమ్మింగ్ పూల్, కొన్ని రకాల నదుల్లో, సరస్సుల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ నీటిలోకి దిగినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి చొచ్చుకుని వెళుతుంది. ఇది శరీరంలో చేరాక కొన్ని రకాల లక్షణాలను చూపిస్తుంది. శరీరం నొప్పులు పెట్టడం, శరీరంపై వాపులు రావడం, జ్వరం రావడం, రక్తపోటు పడిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటివి కనిపిస్తాయి. వాటి తర్వాత అవయవాలు ఫెయిల్ అవుతాయి. చివరకు మరణం సంభవిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే ఇన్ని మార్పులు జరుగుతాయి. అందుకే ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనది అని చెబుతారు.

ఒక వ్యక్తికి ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరి ఉదయం పాదంలో వాపు వస్తే మధ్యాహ్నానికల్లా అది మోకాళ్ల వరకు విస్తరిస్తుంది. అంత వేగంగా ఈ బ్యాక్టీరియా శరీరంలో పాకి పోతుంది. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ బ్యాక్టీరియా అధికంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. భయంకరమైన ఈ బ్యాక్టీరియా వల్ల స్విమ్మింగ్ పూల్ లో దిగేందుకు కూడా జపాన్ వాసులు ఎంతో భయపడుతున్నారు. ఈ బ్యాక్టీరియా కేవలం జపాన్ లోనే కాదు... అన్ని దేశాల్లోను ఉంది. దీన్ని మాంసాన్ని తినే బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, గాయాలు తగిలిన చోట చికిత్స చేయించుకోవడం వంటివి చేయాలి. లేకపోతే ఆ గాయాల ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరిపోతుంది.

బ్యాక్టీరియా శరీరంలోకి చేరాక 48 గంటల్లో అది స్ట్రెప్టో కోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే వ్యాధిగా మారుతుంది. ఈ వ్యాధి వల్ల ఇన్ఫెక్షన్ అన్ని అవయవాలకు సోకి అవయవాలు వైఫల్యం చెందుతాయి. దీనివల్ల మరణం సంభవిస్తుంది. ఈ బాక్టీరియా సోకిన పది మందిలో ముగ్గురు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బ్యాక్టీరియా మనిషి మాంసాన్ని తినేస్తూ ఉంటుంది. మధుమేహం అధికంగా ఉన్న వారిలో ఆల్కహాల్ ను అధికంగా తాగే వారిలో కూడా ఈ బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఆపరేషన్లు జరిగిన వారికి పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. కలుషిత నీటిలో స్నానం చేయడం వంటివి చేయకూడదు. స్విమ్మింగ్ పూల్ పరిశుభ్రంగా ఉంటేనే అందులోకి దిగాలి.