Alcohol and Liver: ఆల్కహాల్ మానేయలేకపోతున్నారా? అయితే కాలేయం దెబ్బతినకుండా ఇలా జాగ్రత్తగా తాగండి-cant stop drinking alcohol but drink this carefully to avoid liver damage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol And Liver: ఆల్కహాల్ మానేయలేకపోతున్నారా? అయితే కాలేయం దెబ్బతినకుండా ఇలా జాగ్రత్తగా తాగండి

Alcohol and Liver: ఆల్కహాల్ మానేయలేకపోతున్నారా? అయితే కాలేయం దెబ్బతినకుండా ఇలా జాగ్రత్తగా తాగండి

Haritha Chappa HT Telugu
Apr 19, 2024 05:00 PM IST

Alcohol and Liver: ఆల్కహాల్ తాగే వారికి కాలేయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ మానలేక ఎంతోమంది సతమతమవుతున్నారు. అలాంటివారు మితంగా ఆల్కహాల్ తాగుతూ కాలేయాన్ని కాపాడుకోవాలి.

ఆల్కహాల్ అలవాటు మానడం ఎలా?
ఆల్కహాల్ అలవాటు మానడం ఎలా? (Pexels)

Alcohol and Liver: ఆల్కహాల్ వినియోగానికీ, కాలేయ ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది. ఎవరైతే ఆల్కహాల్‌ను అధికంగా తాగుతారో వారి కాలేయం త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కేవలం కాలేయ ఆరోగ్యాన్నే కాదు, ఇతర ప్రధాన అవయవాల పనితీరును తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాలేయ వ్యాధి ఏడాదికి రెండు మిలియన్ల మంది మరణించడానికి కారణం అవుతుంది. వీరిలో నాలుగు శాతం మంది కేవలం ఆల్కహాల్ కారణంగానే కాలేయ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. అంటే ప్రతి 25 మందిలో ఒకరు ఆల్కహాల్ కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు.

మన దేశంలో మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధుల వల్ల, దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఇతర దేశాలతో పాలిస్తే రెండు శాతం కంటే ఎక్కువగా ఉంది. అందుకే ఆల్కహాల్ ను పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మద్యం మానలేక ఎంతోమంది ఆ అలవాటును కొనసాగిస్తున్నారు.

ఆల్కహాల్ వల్ల సమస్యలు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు ఆల్కహాల్ తాగుతున్నారు. దీనివల్ల ఆల్కహాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆల్కహాల్ మన శరీరంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ తాగినప్పుడు అది పొట్ట, చిన్న పేగు గోడల ద్వారా రక్త ప్రవాహంలోకి కలిసిపోతుంది. అక్కడ నుంచి మెదడుకు చేరి కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

ఆల్కహాల్ జీర్ణాశయంతర పేగులను ఇబ్బంది పెడుతుంది. పొట్ట, పేగుల లైనింగ్‌ను చికాకు పెడుతుంది. పొట్టలో పుండ్లు, అల్సర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించే శక్తిని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఆల్కహాల్ తాగే వారిలో విటమిన్ బి12, ఫోలేట్ వంటివి లోపించే అవకాశం ఉంది.

ఆల్కహాల్ మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆనందం, విశ్రాంతి వంటివి దొరకనివ్వదు. నిరాశ, ఆందోళన వంటి డిజార్డర్లను పెంచుతుంది. ఆత్మహత్య ఆలోచనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి. దీనికి బానిసలైన వాళ్ళు పూర్తిగా మద్యపానాన్ని మానలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు మితంగా తాగడం అలవాటు చేసుకోవాలి.

మద్యం ఇలా తగ్గించుకోండి

రోజూ తాగే అలవాటు ఉన్నవారు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. రెండు రోజులకు ఒకసారి, ఆ తర్వాత మూడు రోజులకు ఒకసారి ఇలా మితంగా తాగడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత వారానికి ఒక్కసారి మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం తగ్గుతుంది.

ఆల్కహాల్ మీ శరీరానికి చేసే చేటు గురించి ముందుగా అర్థం చేసుకుంటే దానిపై మీకు కాస్త యావగింపు పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ పానీయాలను నేరుగా తాగకుండా. ఆల్కహాల్ లేని నీరు, ఇతర పానీయాలతో మిక్స్ చేసుకోండి. దీని వల్ల ఎక్కువ మద్యం శరీరంలో చేరే అవకాశం తగ్గుతుంది.

తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే లైట్ బీర్, వైన్ వంటివి ఎంచుకొని తాగడం మంచిది. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో కొంత హాని చేసినా... పూర్తి మద్యం తాగే కన్నా వీటిని కలిపి తాగడం ఆరోగ్యానికి కొంత నయం. ఆల్కహాల్ తాగేటప్పుడు పుష్కలంగా నీరును తాగండి. దీనివల్ల శరీరం నిర్జలీకరణానికి గురి కాకుండా ఉంటుంది. శరీరం నుండి టాక్సిన్లు కూడా బయటకి పోతాయి. కాలేయంపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆల్కహాల్ తాగిన రోజు నా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయామం చేయండి. బరువు పెరగకుండా చూసుకోండి. ఇలా అయితే కాలేయంపై తక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.

WhatsApp channel

టాపిక్