World Liver Day 2024: ఆల్కహాల్‌లాగే అధిక చక్కెర, నూనె కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి, లివర్‌ను ఇలా కాపాడుకోండి
World Liver Day 2024: ఆల్కహాల్ మాత్రమే కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అనుకుంటారు, నిజానికి అధిక చక్కెర వాడకం, అధిక నూనె వాడకం కూడా కాలేయ కణజాలాన్ని దెబ్బతీస్తాయి.
World Liver Day 2024: ఆల్కహాల్ వినియోగం కాలేయ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే... ఆల్కహాల్ మాత్రమే కాదు, అధిక చక్కెర, అధిక నూనె వాడకం కూడా కాలేయ ఆరోగ్యాన్ని మందగించేలా చేస్తాయి. అధిక చక్కెర, అధిక నూనె వాడకం కేవలం కాలేయ ఆరోగ్యాన్నే కాదు, శరీర ఆరోగ్యాన్ని మొత్తం కుంగదీస్తాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కాలేయ పనితీరు దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కాలేయ ఆరోగ్యం
శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది మనం తినే ప్రతి ఆహారాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తింటే అవి మొదటగా కాలేయాన్ని చేరుతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోయి... ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. అలాగే మధుమేహం, ఇతర జీవక్రియ రుగ్మతలు కూడా వచ్చేలా చేస్తుంది.
ఆల్కహాల్ అధికంగా తాగితే... ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం. ఆల్కహాల్ తాగకపోయినా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అది అధిక చక్కెర, అధిక కొవ్వులు, అధిక కేలరీలు ఉండే ఆహారం వల్ల వస్తుంది. ఇది కూడా కాలేయ మార్పిడికి కారణం కావచ్చు.
కాలేయానికి ఆల్కహాల్ ఎంత ప్రమాదకరమో... అధికంగా చక్కెర ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం, అధికంగా నూనెను వాడడం కూడా అంతే ప్రమాదకరం. అధిక చక్కెర, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. వీరికి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఆల్కహాల్ వినియోగం కూడా ఏటా పెరుగుతూ వస్తుంది. కాబట్టి వీరందరికీ కాలేయ సమస్యలు వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి.
మన దేశంలో ఎయిమ్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతీయులలో 38 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యను కలిగి ఉన్నారు. ఇది పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది
ఆరోగ్యాన్ని మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తే ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. కాలేయానికి ఒక్కసారి సమస్య వచ్చిందా... దీర్ఘ కాలికంగా వేధిస్తూనే ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం చక్కగా పనిచేయాలి. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలను తినండి. చక్కెరను తగ్గించండి. ఉప్పు, నూనె కూడా తగ్గించండి. మద్యపానాన్ని పూర్తిగా మానేయండి. పండ్లు, కూరగాయలు అధికంగా తినేందుకు ప్రయత్నించండి. అధిక కొవ్వు ఉన్న పదార్థాలు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
టాపిక్