Alcohol: మద్యం తాగే అలవాటు ఉందా? ఓ నాలుగు వారాలు ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేయండి, ఏం జరుగుతుందంటే…
Alcohol: మద్యం అలవాటు ఉన్న వారి సంఖ్య అధికంగానే ఉంది. వారు ఒక నెలరోజుల పాటు మద్యం మానేస్తే వారి శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి.
Alcohol: మద్యానికి బానిసలైన వారి సంఖ్య తక్కువేమీ కాదు. రాత్రి అయితే చాలు భోజనం ఉన్నా, లేకపోయినా పక్కన ఆల్కహాల్ బాటిల్ ఉండాల్సిందే. అది తాగే నిద్రపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న వారు ప్రపంచంలో అధికంగానే ఉన్నారు. మద్యం తాగడం వల్ల శరీరంలో ఎన్నో చెడు ప్రభావాలు పడతాయి. ఒక నెల రోజుల పాటు ఆల్కహాల్ మానేసి చూడండి. మీ శరీరంలో వచ్చే మార్పులను గమనించండి.
మద్యంతో వచ్చే వ్యాధులు
మద్యం అధికంగా తాగితే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఏళ్లపాటు మద్యం తాగే వారికి లివర్ సిర్రోసిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. ఇదే కాదు ఇంకా అనేక రకాల రోగాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒక నెలపాటు మద్యం మానేసి చూడండి. మీలో ఎన్నో మంచి మార్పులు వస్తాయి.
ఆల్కహాల్ తాగకపోవడం వల్ల దెబ్బ తిన్న కాలేయం సాధారణంగా అవుతుంది. అంతేకాదు అది ఉత్తమంగా పనిచేయడం మొదలు పెడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
మద్యం అనేది క్యాన్సర్ కారకం. ఆల్కహాల్ తాగే వ్యక్తికి త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల, మెడ ప్రాంతంలో క్యాన్సర్ పుట్టే అవకాశం ఉంది. అలాగే అన్నవాహిక, పెద్ద పేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ కూడా వస్తుంది. నెల రోజులు పాటు మద్యాన్ని మానేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
మద్యం వల్ల మీ చర్మం పొడిబారిపోతుంది. మీ వయసు పెరిగినట్టు కనిపిస్తుంది. మీరు బరువు తగ్గిపోతారు. 20 ఏళ్ల వ్యక్తి కూడా 40 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తారు. అదే నెలరోజుల పాటు మద్యం మానేస్తే మళ్లీ మీరు 20 ఏళ్ల యవ్వనంతో తొణికిసలాడుతారు. మీరు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. చర్మం మెరుపు సంతరించుకుంటుంది.
మద్యాన్ని మానేస్తే
ఆల్కహాల్ తాగడం వల్ల మెదడు పనితీరు మారిపోతుంది. మెదడు కుచించుకుపోయేలా చేస్తుంది. మద్యం ఆలోచించే శక్తిని చంపేస్తుంది. విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మీరు మద్యాన్ని మానుతారో, మళ్లీ మొదటిలా సాధారణ స్థితికి వస్తుంది. మీ ఆలోచన తీరు మారుతుంది. ఎదుటివారితో మీరు చక్కగా మాట్లాడతారు. మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి ఒక నెలరోజుల పాటు మద్యం మానేసి చూడండి. ఆ వచ్చే మార్పులు మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ మార్పులు మీకు నచ్చితే పూర్తిగా మద్యాన్ని మానేయడానికి ప్రయత్నించండి.
టాపిక్