Kangana Ranaut: ‘‘రేప్ ఎలా జరుగుతుందో కంగనా రనౌత్ ను అడగండి’’ - పంజాబ్ మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై పంజాబ్ కు చెందిన ఒక మాజీ ఎంపీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ‘అత్యాచారం అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది? అనే విషయాలను కంగనా రనౌత్ ను అడగండి’ అని అవమానకరంగా మాట్లాడాడు. రైతు ఉద్యమంపై కంగన చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ వ్యాఖ్యలు చేశానన్నాడు.
Kangana Ranaut: రైతుల ఆందోళన బంగ్లాదేశ్ తరహా శాంతిభద్రతల పరిస్థితికి దారితీస్తుందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ మాజీ ఎంపీ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేశానన్నారు.
అత్యాచారం గురించి కంగనాను అడగండి
శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్) చీఫ్, పంజాబ్ మాజీ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ కంగనా రనౌత్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. కంగనాకు అత్యాచారం అనుభవం ఉందని అన్నారు. ‘‘అత్యాచారం ఎలా జరుగుతుందో మీరు ఆమెను (కంగనా రనౌత్) అడగవచ్చు, తద్వారా అత్యాచారం ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించవచ్చు. ఆమెకు అత్యాచార అనుభవం చాలా ఉంది’’ అని ఆయన చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
బంగ్లాదేశ్ పరిస్థితి
భారత నాయకత్వం తగినంత బలంగా లేకపోతే రైతుల ఆందోళన బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారితీసేదని నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ (kangana ranaut) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల్లో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, అత్యాచారాలు జరిగాయని ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన ఒక వీడియోలో ఆరోపించారు. రైతుల నిరసన బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారితీసి ఉండొచ్చని కంగనా రనౌత్ విమర్శించారు.
విదేశీ శక్తుల కుట్ర
ఈ కుట్ర వెనుక చైనా, అమెరికా వంటి విదేశీ శక్తుల హస్తం ఉందని కంగనా రనౌత్ ఆరోపించారు. అయితే, తన వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం తనను మందలించిందని ఆమె బుధవారం ఓ ఛానల్ తో అన్నారు. ‘పార్టీకి నేనే అంతిమ వాయిస్ అని నేను అనుకోవడం లేదు’ అన్నారు. బంగ్లాదేశ్ లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలయ్యారు. జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి విజయం సాధించారు.