Bangladesh Crisis : ఇది షేక్ హసీనా చేసుకున్న తప్పేనా? ఆమె భారత్‌లోనే ఎందుకు దిగింది?-what was sheikh hasina mistake in bangladesh and why she choose india for landing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bangladesh Crisis : ఇది షేక్ హసీనా చేసుకున్న తప్పేనా? ఆమె భారత్‌లోనే ఎందుకు దిగింది?

Bangladesh Crisis : ఇది షేక్ హసీనా చేసుకున్న తప్పేనా? ఆమె భారత్‌లోనే ఎందుకు దిగింది?

Anand Sai HT Telugu
Aug 05, 2024 10:42 PM IST

Bangladesh Crisis Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా రాజీనామా చేశారు. హెలికాప్టర్‌లో దేశం విడిచి.. భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె నిరసనకారులపై ఉన్న తీరుతోనే ఈ పరిస్థితి ఎదురైంది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సోమవారం ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె తన సోదరితో కలిసి హెలికాప్టర్‌లో దేశం విడిచి పారిపోయారు. ఆమె రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ధృవీకరించారు. త్వరలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ త్వరలో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుందని తెలిపింది.

ఇండియాకు షేక్ హసీనా

షేక్ హసీనా విమానం సోమవారం సాయంత్రం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయింది. భారత గగనతలంలోకి ప్రవేశించినప్పటి నుండి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ వరకు విమానాల కదలికను భారత వైమానిక దళం, భద్రతా సంస్థలు పర్యవేక్షించాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల దృష్ట్యా, భారతదేశంలోని సరిహద్దు భద్రతా దళం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది.

అందుకోసమే భారత్‌లోకి

హిండన్ న్యూ ఢిల్లీకి సమీపంలో ఉన్నందున షేక్ హసీనా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. హిండన్ ఎయిర్‌బేస్‌లో C130తో సహా భారతదేశానికి చెందిన రవాణా విమానాలు ఉన్నాయి. న్యూఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్నందున హసీనాకు ఫూల్‌ భద్రత ఉంటుందని దీనిని ఎంచుకున్నారు.

త్వరలో యూకేకు

అయితే హసీనా భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరలేదు. ఆమె UKలో ఆశ్రయం పొందాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. త్వరలో లండన్‌కు బయలుదేరవచ్చు లేదా కొంతకాలం భారతదేశంలో ఆగిపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఆమె చివరికి ఫిన్‌లాండ్‌కు వెళ్లవచ్చని కూడా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అజిత్‌ దోవల్‌తో చర్చలు

ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉన్నత సైనిక అధికారులతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో కలిశారు. బంగ్లాదేశ్ పరిస్థితులపై వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. తన రాజీనామాకు కొన్ని రోజుల ముందు హసీనా బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్‌తో మాట్లాడుతూ 'అరాచకవాదులు తమ దేశంలో శ్రీలంక తరహా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించారు.' అని చెప్పారు.

దేశంలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో రాజీనామా చేయడమే సరైన నిర్ణయమని కొంతమంది చెబుతున్నారు. నిజానికి హసీనా గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడంలో విఫలమవడం ద్వారా ఆమె ఈ పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది.

చివరకు సింగిల్ పాయింట్‌‌పై

ఆగస్టు 4న జరిగిన ఘటనతో నిరసనకారులు ఇంకా రెచ్చిపోయారు. 100 మందికి పైగా మరణించిన తర్వాత దేశం అంతర్యుద్ధంలో వెళ్లినట్టుగా ప్రపంచానికి కనిపించింది. ఈ నిరసనల్లో ఇప్పటి వరకూ 300 మందికిపైగా మరణించారు. ప్రభుత్వ సర్వీసుల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ, స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ (SAD) ఆధ్వర్యంలో ఐక్యంగా ఉన్న నిరసనకారులు, హసీనా రాజీనామా అనే సింగిల్ పాయింట్ డిమాండ్‌తో ఆదివారం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 5న లాంగ్ మార్చ్ టూ ఢాకాకు పిలుపునిచ్చారు. ఇది కాస్త తీవ్రంగా మారి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది.

కోటాపై వివాదం

చాలా ఏళ్లుగా స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటాపై వివాదం ఉంది. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఈ విధానాన్ని తీసుకువచ్చారు. భారతదేశ మద్దతుతో బంగ్లాదేశ్ గెలిచిన ఆ యుద్ధంలో పాలక అవామీ లీగ్ ముందంజలో ఉంది. అయితే స్వాతంత్ర్య సమరయోధుల కోటా కూడా PM హసీనా అవామీ లీగ్ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది. దీనిపై ఇతర రాజకీయ పార్టీల మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరిట్ ఆధారిత వ్యవస్థను డిమాండ్ చేశారు.

గతంలో రద్దు చేసిన హసీనా

నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2017లో హసీనా స్వయంగా ఈ రిజర్వేషన్‌ను రద్దు చేశారు. అయితే హైకోర్టు గత నెలలో ఈ నిర్ణయాన్ని కొట్టివేసింది. రిజర్వేషన్‌ను పునరుద్ధరించింది. దిగువ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ, విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. కోర్టు కేసులను పేర్కొంటూ విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ఇప్పుడు ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరంకుశ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు వరుసగా ప్రధాని పీఠంపై కూర్చొన్న హసీనా దిగిపోవాల్సి వచ్చింది. సైన్యం పాలన వచ్చింది.

సరైన నిర్ణయం తీసుకోలేక..

విద్యార్థులను శాంతపరిచేందుకు హసీనా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో విఫలమైంది. వారితో చర్చలు చేసి వారికి తగిన విధంగా మద్దతు ఇవ్వాల్సి ఉండేది. కానీ అలాంటివేమీ ఆమె పట్టించుకోలేదు. హసీనా నిరసనకారులపై చేసిన కామెంట్స్ కూడా మరింత మరింత ఆజ్యం పోశాయి. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. చివరకు పదవి నుంచి షేక్ హసీనా దిగిపోయారు.

టాపిక్