Bangladesh PM Resigns: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. ఢాకా నుంచి భారత్‌కు వచ్చినట్టు సమాచారం!
Bangladesh PM Sheikh Hasina Resigns: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే సోమవారం నాడు దేశం విడిచి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియా వార్తలు ప్రచురించింది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా నివేదించింది. అయితే షేక్ హసీనా ఢాకా నుండి వెళ్లడం, రాజీనామాపై అధికారిక ధృవీకరణ లేదు.
రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా ముందుగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుండి తన సోదరితో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరినట్లు నివేదికలు తెలిపాయి. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడినవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కేటాయించే వివాదాస్పద కోటా విధానంపై కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. దీంతో హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. నివేదికల ప్రకారం ఆర్మీ చీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోటా విధానంలో 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు కేటాయించారు, మహిళలు, మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అదనపు రిజర్వేషన్లు ఉన్నాయి. నిరసనకారులు ఈ కోటాను 10శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. మెరిట్ ఆధారంగా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అంటున్నారు.
ఇప్పటికే బంగ్లాదేశ్ నిరసనల్లో వంద మందికిపైగా మృతి చెందారు. చాలా మందికి గాయాలపాలయ్యారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా.. నిరసనకారులు వెనక్కు తగ్గడం లేదు. అందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త కర్ఫ్యూను ధిక్కరిస్తూ విద్యార్థులు ఢాకుకు వచ్చారు. ఆదివారం నాడు పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. నిరసనలతో దేశంలో చాలా సేవలు నిలిపివేశారు. సోమవారంనాడు దేశ రాజధానిలో నిరసనలకు పిలుపునిచ్చారు.
దీంతో సోమవారం షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. తర్వాత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అధికారిక నివాసం విడిచిపెట్టి వెళ్లారు. ఆమె 1947 సెప్టెంబర్ 28న జన్మించారు. ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక వ్యక్తి. 1975లో సైనిక తిరుగుబాటులో చనిపోయారు.
హసీనా బంగ్లాదేశ్‌కు ఐదుసార్లు ప్రధానమంత్రిగా చేశారు. మెుదటిసారిగా 1996లో కార్యాలయానికి ఎన్నికయ్యారు. 2001 వరకు పూర్తి కాలం పని చేశారు. 2009 నుంచి వరుసగా నాలుగుసార్లు ప్రధాని అయ్యారు. దేశంలో అధికార పార్టీగా ఉన్న అవామీ లీగ్‌కు ఆమె నాయకురాలు.