Bangladesh violence : నిరసనలతో బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం- ప్రధాని రాజీనామానే వారి టార్గెట్!
Bangladesh violence death tll : బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామాకు తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగాయి. హింసాత్మక ఘటనల్లో 90కిపైగా మంది మృతి చెందారు!
నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బంగ్లాదేశ్‌లో అలజడులు పతాకస్థాయికి చేరాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణల్లో కనీసం 91 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తాజా పరిణామాల మధ్య మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని, నిరవధిక కాలం దేశవ్యాప్త కర్ఫ్యూను అమలు చేయడం అధికారులకు తప్పలేదు.
బంగ్లాదేశ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు..
ఉద్యమకారులు కుటుంబాలకు ‘కోటా’కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో గత కొన్ని వారాలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. కోటా వ్యవహారం కొలిక్కి వచ్చి, దానిని కోర్టు రద్దు చేసింది. కానీ ఇప్పుడు నిరసనకారులు షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేస్తూ, ఆందోళనకు దిగారు. ఆదివారం ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. దక్షిణాసియా దేశంలో హింస తిరిగి ప్రారంభమైన తరువాత దేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు "అప్రమత్తంగా ఉండాలని" బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక సలహాను జారీ చేసింది.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్‌లో సిల్హెట్‌లోని భారత రాయబార కార్యాలయం 'అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా, సిల్హెట్ పరిధిలో నివసిస్తున్న విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరూ ఈ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము,' అని పోస్ట్ చేసింది.
అత్యవసరాల కోసం భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ని కూడా జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో +88-01313076402ను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయం తన పోస్టులో పేర్కొంది.
విద్యార్థుల నిరసన
బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగిన హింసాకాండలో కనీసం 91 మంది మరణించారు (14 మంది పోలీసులతో సహా). వందలాది మంది గాయపడ్డారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పదుల సంఖ్యలో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. స్టన్ గ్రెనేడ్లను విసిరారు.
ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సహాయ నిరాకరణోద్యమానికి హాజరైన నిరసనకారులకు అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తల మద్దతుదారుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ఘర్షణలు చెలరేగాయి.
దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 91 మంది చనిపోయారని ప్రముఖ బెంగాలీ దినపత్రిక ప్రోథోమ్ అలో నివేదికను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.
దేశవ్యాప్తంగా 14 మంది పోలీసులు మృతి చెందినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం తెలిపింది. వీరిలో 13 మంది సిరాజ్ గంజ్‌లోని ఎనాయెత్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించారు. కొమిల్లాలోని ఇలియట్ గంజ్‌లో ఒకరు మృతి చెందినట్లు ఆ పత్రిక తెలిపింది.
దేశవ్యాప్త నిరవధిక కర్ఫ్యూ..
హింసాకాండ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నిరవధిక దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది.
వదంతుల వ్యాప్తిని నిరోధించడానికి ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 4జీ మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేయాలని మొబైల్ ఆపరేటర్లను ఆదేశించినట్లు ఆ పత్రిక తెలిపింది.
కాగా, నిరసన పేరుతో దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులు అని ప్రధాని హసీనా అన్నారు. వాటిని దృఢమైన చేతితో అణచివేయాలని ఆమె ప్రజలను కోరారు.
ఈ ఉగ్రవాదులను దృఢంగా అణచివేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని బంగ్లా ప్రధాని పేర్కొన్నారు.
ప్రభుత్వం రాజీనామా చేయాలనే ఏకపక్ష డిమాండ్‌తో ఆదివారం నుంచి సహాయ నిరాకరణోద్యమానికి స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ అనే వేదిక పిలుపునిచ్చింది.
సంబంధిత కథనం