GSWS Secretariats: వాలంటీర్ వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం.. గ్రూపులు డిలీట్ చేయాలని ఆర్డర్స్
GSWS Secretariats: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లలో రాజీనామా చేసిన వారు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తుండటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
GSWS Secretariats: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసిన వాలంటీర్లలో రాజీనామాలు చేసిన వారు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తుడంటం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాలంటీర్లు ఏర్పాటు చేసిన గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సచివాలయాల శాఖ డైరెక్టర్… కలెక్టర్లను ఆదేశించిచారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న ప్రజలు కూడా అయా గ్రూపుల నుంచి వైదొలిగేలా విస్తృత అవగాహన కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాట్సప్ గ్రూపుల తొలగింపుపై మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను రాష్ట్ర సచివాలయాలశాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలి…
ఏపీ సేవా, మీ సేవా కేంద్రాల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 400కు పైగా పౌర సేవల్ని ఏపీ సేవా, మీ సేవా పోర్టళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఎలాంటి దరఖాస్తులు భౌతిక రూపంలో అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భౌతిక రూపంలో వచ్చే దరఖాస్తుల్ని ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు.