Pat Cummins Hat Trick: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో క‌మిన్స్ హ్యాట్రిక్ - ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌-pat cummins claims first hat trick in t20 world cup 2024 as australia beat bangladesh by 28 runs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pat Cummins Hat Trick: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో క‌మిన్స్ హ్యాట్రిక్ - ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌

Pat Cummins Hat Trick: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో క‌మిన్స్ హ్యాట్రిక్ - ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 21, 2024 11:30 AM IST

Pat Cummins Hat Trick: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో తొలి హ్యాట్రిక్ న‌మోదు అయ్యింది. బంగ్లాదేశ్‌పై పాట్ క‌మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ విధానంలో ఆస్ట్రేలియా విజ‌యాన్ని సాధించింది.

పాట్ క‌మిన్స్ హ్యాట్రిక్
పాట్ క‌మిన్స్ హ్యాట్రిక్

Pat Cummins Hat Trick: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదు అయ్యింది. సూప‌ర్ 8 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేస‌ర్ పాట్ క‌మిన్స్ హ్యాట్రిక్ తో రికార్డ్ నెల‌కొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌల‌ర్ల దెబ్బ‌కు 20 ఓవ‌ర్ల‌లో బంగ్లాదేశ్ 140 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఆస్ట్రేలియా 11.2 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగులు చేసింది. వ‌ర్షం కార‌ణంగా ఆట నిలిచిపోవ‌డంతో ఆస్ట్రేలియాను విజేతగా ప్ర‌క‌టించారు.

క‌మిన్స్ హ్యాట్రిక్‌...

ఈ మ్యాచ్ ద్వారా 2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా పాట్‌ క‌మిన్స్ నిలిచాడు. వ‌రుస‌గా మూడు బాల్స్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మ‌హ్మ‌దుల్లా, మెహ‌దీ హ‌స‌న్‌తో పాటు తౌఫిక్ హ్రిదోయ్‌ల‌ను క‌మిన్స్ ఔట్ చేశాడు. 18వ ఓవ‌ర్ చివ‌రి రెండు బాల్స్‌కు మ‌హ్మ‌దుల్లా, మెహ‌దీ హ‌స‌న్‌ల‌ను ఔట్ చేసిన క‌మిన్స్‌...లాస్ట్ ఓవ‌ర్ తొలి బాల్‌కు తౌఫిక్ హ్రిదోయ్‌ను పెవిలియ‌న్‌కు పంపించి ఈ రికార్డ్ నెల‌కొల్పాడు.

ఏడో బౌల‌ర్‌...

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ్యాట్రిక్ న‌మోదు చేసిన రెండో ఆస్ట్రేలియా బౌల‌ర్‌గా పాట్ క‌మిన్స్ రికార్డ్ నెల‌కొల్పాడు. 2007 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌పైనే బ్రెట్ లీ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మొత్తంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏడో బౌల‌ర్‌గా క‌మిన్స్ రికార్డ్ సృష్టించాడు. ఈ లిస్ట్‌లో ఐర్లాండ్ బౌల‌ర్లు జోష్ లిటిల్‌, క‌ర్టిస్ క్యాంఫ‌ర్‌, శ్రీలంక స్పిన్స‌ర్ హ‌స‌రంగ‌, కాసిగో ర‌బాడా (సౌతాఫ్రికా), కార్తిక్ మైయ‌ప్ప‌న్ (యూఏఈ)తో పాటు బ్రెట్ లీ, క‌మిన్స్ ఉన్నారు.

ఇద్ద‌రు మాత్ర‌మే...

కాగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ షాంటోతో పాటు తౌఫిక్ హ్రిదోయ్ ఆదుకోవ‌డంతో బంగ్లాదేశ్ ఈ మాత్ర‌మైనా స్కోరు చేయ‌గ‌లిగింది. షాంటో 36 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 41 ర‌న్స్ చేశాడు. హ్రిదోయ్ 28 బాల్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 40 ర‌న్స్ తో రాణించాడు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ సింగిల్ డిజిట్ స్కోర్ల‌కు వెనుదిరిగారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్ మూడు, ఆడ‌మ్ జంపా రెండు వికెట్లు తీసుకున్నారు.

వార్న‌ర్ హాఫ్ షెంచ‌రీ...

141 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలో దిగిని ఆస్ట్రేలియా డ‌క్ వ‌ర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్‌పై 28 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 11.2 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 100 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా వ‌ర్షం ప‌డ‌టంతో మ్యాచ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. తిరిగి మ్యాచ్ నిర్వ‌హించే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాను విజేత‌గా ప్ర‌క‌టించారు.

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 35 బాల్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 21 బాల్స్‌లో 31 ర‌న్స్ చేశాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 1 ప‌రుగుల‌తో నిరాశ ప‌రిచాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఆరు బాల్స్‌లో ఓ సిక్స్‌, ఫోర్‌తో 14 ర‌న్స్‌తో వార్న‌ర్‌తో పాటు క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా కోల్పోయిన రెండు వికెట్లు బంగ్లా బౌల‌ర్ రిషాద్ హుస్సేన్‌కు ద‌క్కాయి.

WhatsApp channel