Train Services : బంగ్లాదేశ్‌కు అన్ని రైలు సర్వీసులు నిలిపివేసిన భారత్.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్
Bangladesh Protests : బంగ్లాదేశ్‌లో ఇంకా నిరసనలు చల్లారడం లేదు. ఇప్పటికే షేక్ హసీనా అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లారు. అయితే తాజాగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైలు సర్వీసులను నిలిపి వేసింది.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లకల్లోలం మధ్య మాజీ ప్రధాని షేక్ హసీనా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చారు. నిరసనకారులు ఆమె నివాసంపై దాడి చేశారు. ఆమె భారతదేశం వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే భద్రత కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్‌తు అన్ని రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు భారతదేశం సోమవారం ప్రకటించింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరీ కోల్‌కతాకు చేరుకుని పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.
ప్రస్తుత పరిస్థితులపై బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌తో బీఎస్ఎఫ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి సాధారణంగానే ఉంది. బంగ్లాదేశ్లో కర్ఫ్యూ కారణంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల(ఐసీపీ) వద్ద రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. అక్రమ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి భద్రత, గస్తీని పెంచారు. సరైన పత్రాలు లేకుండా త్రిపురలోకి ప్రవేశించిన 12 మంది బంగ్లాదేశీయులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
నిరసనలు ఎక్కువ అవ్వడంతో జూలై మొదటి వారంలో భారతదేశం తన పౌరుల భద్రత కోసం ఢాకాలోని హైకమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. తదుపరి నోటీసు వచ్చే వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారత పౌరులకు సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయులు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని గట్టిగా చెప్పింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బయట తిరగొద్దని భారత్ హెచ్చరించింది. 8801958383679, 8801958383680, 8801937400591 అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా ఢాకాలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు జరపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హింసాత్మక ఘర్షణలు సాధారణ విద్యా సంవత్సరానికి అంతరాయం కలిగించడంతో బంగ్లాదేశ్‌లో చదువుతున్న భారత్, భూటాన్, నేపాల్‌కు చెందిన దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు భారత్‌కు వచ్చారు.
ప్రస్తుతానికి బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించేందుకు భారత్ నిరాకరించింది. హింసాత్మక నిరసనలను భారత్ ఎలా చూస్తుందనే ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంగా తాము చూస్తున్నామని చెప్పారు.