Bangladesh Violence : బంగ్లాదేశ్ నిరసనలు.. 150 మంది మృతి.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
Bangladesh Reservation Protest : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలలో 150 మంది చనిపోయారు. అయితే తాజాగా ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలని బంగ్లాదేశ్‌లో విద్యార్థులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు ఉద్రిక్తస్థాయికి వెళ్లాయి. కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తూ.. విద్యార్థులు తిరిగి చదువులోకి వెళ్లాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం తెలిపింది. ఈ ఆందోళనలో 150 మందికి పైగా మరణాలు, 2,500 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ విషయంపై విచారణ చేసిన సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
దిగువ కోర్టు నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. 1971 లిబరేషన్ వార్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులతో సహా కొన్ని సమూహాలకు ఉద్యోగాలలో గణనీయమైన రిజర్వేషన్లు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన మెుదలుపెట్టారు. వాస్తవానికి ప్రభుత్వం 2018లో ఈ కోటాలను రద్దు చేసింది, అయితే దిగువ కోర్టు వాటిని పునరుద్ధరించింది.
సుప్రీం కోర్టు కీలక తీర్పు
దిగువ కోర్టు నిర్ణయాన్నిబంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఇప్పుడు తోసిపుచ్చింది. కోటాను సవాలు చేస్తూ విద్యార్థుల తరపు న్యాయవాది షా మొంజూరుల్ హోక్ వాదనలు వినిపించారు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలని కోర్టు కోరింది.
నిరసనల దృష్ట్యా.. ప్రభుత్వం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ, మొబైల్ డేటా, ATM సేవలను నిలిపివేసింది. ఇంటర్నెట్ షట్‌డౌన్‌తో సహా కఠినమైన చర్యలను విధించింది. గుమిగూడకుండా ఉండేందుకు అధికారులు ప్రభుత్వ సెలవులు కూడా ప్రకటించారు. రాజధాని ఢాకా సైనిక నిఘాలో ఉంది. అల్లర్లను నియంత్రించడానికి ప్రభుత్వం షూట్ ఆన్ సైట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది.
10 శాతానికి తగ్గించాలని
ప్రస్తుతం ఉన్న కోటా విధానంలో 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు కేటాయించారు, మహిళలు, మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అదనపు రిజర్వేషన్లు ఉన్నాయి. నిరసనకారులు ఈ కోటాను 10శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. మెరిట్ ఆధారంగా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని వాదించారు.
దీంతో బంగ్లాదేశ్‌లో నిరసనలు మెుదలయ్యాయి. నిరసనలు రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించాయి. చాలా మంది నివాసితులు దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. హింసాత్మక ఘటనల కారణంగా ప్రధాని షేక్ హసీనా స్పెయిన్, బ్రెజిల్‌లలోని పర్యటనలను రద్దు చేసుకున్నారు.
గతంలో రద్దు
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ విధానాన్ని 2018లో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 5 శాతం, ఇతర వర్గాలకు మరో 2 శాతం మాత్రమే రిజర్వ్ చేశారు. అయితే దిగువ స్థాయి కోర్టు మాత్రం దీనిని రద్దు చేసింది. మళ్లీ 30 శాతం కోటాను పునరుద్ధరించింది. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మెుదలయ్యాయి.
బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల్లో భారీ ఎత్తున జనం మృతి చెందారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్నా.. లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చారు. ఇందులో దాదాపు 150 మంది చనిపోగా.. 2 వేల మందికిపైగా గాయపడ్డారు. రిజర్వేషన్లపై విచారణ చేసిన సుప్రీం కోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఇప్పటికే హింసను అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.