Bangladesh protests : బంగ్లాదేశ్​లో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం.. నిరసనలకు 109మంది బలి!-bangladesh imposes nationwide curfew deploys military ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bangladesh Protests : బంగ్లాదేశ్​లో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం.. నిరసనలకు 109మంది బలి!

Bangladesh protests : బంగ్లాదేశ్​లో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం.. నిరసనలకు 109మంది బలి!

Sharath Chitturi HT Telugu
Jul 20, 2024 06:12 AM IST

Bangladesh protests latest news : బంగ్లాదేశ్​ నిరసనల్లో ఇప్పటివరకు 109మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలను నియంత్రించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

బంగ్లాదేశ్​లో భారీ నిరసనలు..
బంగ్లాదేశ్​లో భారీ నిరసనలు.. (AFP)

1971లో పాకిస్థాన్​తో జరిగిన విమోచన యుద్ధంలో పాల్గొన్న సైనికుల పిల్లలతో సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికి పైగా నిర్దిష్ట వర్గాల రిజర్వేషన్​ కోసం ప్రవేశపెట్టిన కోటా విధానానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్​లో జరుగుతున్న నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ప్రధాని షేక్​ హసీనా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది.

కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని నగరం ఢాకాలో బహిరంగ సభలపై నిషేధం పడింది. ర్యాలీలను సైతం నిషేధించారు. ప్రజా భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లాదేశ్​ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు! భారీ ఎత్తున్న రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో పోలీసులు- ఆందోళనకారుల మధ్య ప్రతిష్ఠంభన కనిపించింది.

బంగ్లాదేశ్​లో నిరసనలు చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. కోటా వ్యవస్థను తీసివేయాలని డిమాండ్​ చేస్తూ.. షేక్​ హసీనా 15ఏళ్ల ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తున్నా, అవి మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్​ నిరసనల్లో ఇప్పటివరకు 109మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 50మందికిపైగా మంది ప్రజలు ఒక్క శుక్రవారమే మరణించారు. వీరిలో చాలా మంది పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచిన వారే ఉన్నారు. గురువారం మరో 25మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులపై కాల్పుల విషయంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్​ వొల్కర్​ టర్క్​ స్పందించారు. విద్యార్థులపై దాడులు చేయడం షాకింగ్​, ఆమోదయోగ్యం కాని విషయం అన్నారు.

కానీ బంగ్లాదేశ్​లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. నర్సింగ్ది జిల్లాలోని జైలులోకి చొరబడిన నిరసనకారులు ఖైదీలను విడుదల చేశారు. అనంతరం ఆ జైలుకు నిప్పంటించారు. వందకుపైగా మంది ఖైదీలు తప్పించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా నిరసనకారులు పేట్రేగిపోతున్నారు. పోలీసు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు.

ఈ నిరసనలకు మూలమైన 'కోటా' వ్యవస్థపై పలు ఆరోపణలు వస్తున్నాయి. షేక్​ హసీనా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారికే ఈ కోటాలో ప్రయోజనాలు జరుగుతాయని అంటున్నారు. ఇంతకాలం తనకు విధేయులుగా నిలిచిన వారికి రివార్డులు ఇచ్చేందుకే ఈ కోటా వ్యవస్థను షేక్​ హసీనా తీసుకొచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఈ కోటాను ఆ దేశ సుప్రీంకోర్టు సస్పెండ్​ చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేసింది.

షేక్​ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్​ని పాలిస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో, ఎలాంటి విపక్షం లేకుండా మరోసారి విజయం సాధించారు.

భారత్​కు భారతీయ విద్యార్థులు..

బంగ్లాదేశ్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జీవిస్తున్న భారతీయులు, చదువుకుంటున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. కాగా నిరసనల నుంచి బయటపడేందుకు భారత విద్యార్థులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. ఏది దొరికితే అది పట్టుకుని సరిహద్దును దాటుతున్నారు. ఇప్పటికే 300మంది విద్యార్థులు భారత్​కు చేరుకున్నారు.

ఈ 300 మందిలో చాలా మంది ఎంబీబీఎస్​ చదువుకుంటున్న వారే ఉన్నారు. వీరందరు యూపీ, హరియాణా, మేఘాలయ, జమ్ముకశ్మీర్​కి చెందినవారు.

మంగళవారం వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్టు, కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగినట్టు విద్యార్థులు చెబుతున్నారు. అందుకే బంగ్లాదేశ్​ని తాత్కాలికంగా వదిలి వచ్చినట్టు స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం