Ys Sharmila: అసెంబ్లీకి పోకుండా పదవెందుకు? ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్-sharmila demands that jagan resign from the post of mla ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila: అసెంబ్లీకి పోకుండా పదవెందుకు? ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్

Ys Sharmila: అసెంబ్లీకి పోకుండా పదవెందుకు? ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్

Sarath chandra.B HT Telugu
Jul 29, 2024 05:56 AM IST

Ys Sharmila: అసెంబ్లీకి వెళ్లనపుడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఎందుకని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్

Ys Sharmila: అసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనంమని, ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవన్నారు.

మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అని నిలదీశారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని... రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందన్నారు.

గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అన్నారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని, వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని, ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని షర్మిల ఘాటుగా విమర్శించారు.

ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవరికి కావాలన్నారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Whats_app_banner