Results 2024: లోక్ సభ ఎన్నికల్లో రికార్డు సృష్టించిన శాంభవి చౌదరి.. మోదీ ప్రశంసలు పొందిన ఎవరీ యువ ఎంపీ?-results 2024 who is shambhavi choudhary indias youngest mp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Results 2024: లోక్ సభ ఎన్నికల్లో రికార్డు సృష్టించిన శాంభవి చౌదరి.. మోదీ ప్రశంసలు పొందిన ఎవరీ యువ ఎంపీ?

Results 2024: లోక్ సభ ఎన్నికల్లో రికార్డు సృష్టించిన శాంభవి చౌదరి.. మోదీ ప్రశంసలు పొందిన ఎవరీ యువ ఎంపీ?

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 03:06 PM IST

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి శాంభవి చౌదరి రికార్డు సృష్టించారు. శాంభవి చౌదరి వయసు కేవలం 25 సంవత్సరాలు. ఆమె మూడో తరం రాజకీయ నాయకురాలు. బీహార్లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జన శక్తి పార్టీ తరఫున ఆమె విజయం సాధించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో శాంభవి చౌధరి
ప్రధాని నరేంద్ర మోదీతో శాంభవి చౌధరి (ANI file photo)

లోక్ జనశక్తి పార్టీ (LJP) నాయకురాలు శాంభవి చౌదరి లోక్ సభ ఎన్నికల్లో బీహార్లోని సమస్తిపూర్ నుంచి విజయం సాధించి భారత్ లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సన్నీ హజారీని 187251 ఓట్ల తేడాతో శాంభవి చౌదరి ఓడించారు. తనకు ఘన విజయం అందించిన సమస్తిపూర్ ప్రజలకు ఆమె ధన్యావాదాలు తెలిపారు. వారు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. సమస్తిపూర్ నాకు పెద్ద విజయాన్ని ఇచ్చింది, ప్రజలు వారి హృదయంలో నాకు స్థానం ఇచ్చారని నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.

ఎవరీ శాంభవి చౌదరి?

శాంభవి చౌదరి వయసు కేవలం 25 సంవత్సరాలు. ఆమె మూడో తరం రాజకీయ నాయకురాలు. శాంభవి చౌదరి తండ్రి అశోక్ చౌదరి జేడీయూ నేత. నితీశ్ కుమార్ క్యాబినెట్ లో అత్యంత కీలక మంత్రుల్లో ఆయన ఒకరు. ఆమె తండ్రి అశోక్ చౌదరి కాంగ్రెస్ నుంచి జేడీయూలో చేరారు శాంభవి చౌదరి తాత దివంగత మహావీర్ చౌదరి కూడా కాంగ్రెస్ సభ్యుడే. కాంగ్రెస్ పార్టీ బీహార్ ను పాలించినప్పుడు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అంతేకాదు, ఆమె సంఘ సంస్కర్త, మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ కోడలు. శాంభవి చౌదరి భర్త ఆచార్య కిషోర్ కునాల్ కొడుకు సాయన్ కునాల్.

ప్రధాని మోదీ ప్రశంసలు

బీహార్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ శాంభవి చౌధరిని ప్రశంసించారు. తనకు మొదటి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉండేదని శాంభవి చౌదరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఏ తండ్రి కూడా తన పిల్లలను గెలిపించలేడు. గెలుపు కోసం ఎవరికి వారే కష్టపడాలి. లోక్ సభలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు లభిస్తుందో లేదో సమస్తిపూర్ ప్రజలు నిర్ణయిస్తారు కానీ నా కుటుంబం కాదు’’ అని ఆమె అన్నారు.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎమ్ ఏ

శాంభవి చౌదరి ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ (సోషియాలజీ) చదివారు. ‘‘నాకు రాజకీయాలను, సమాజాన్ని అర్థం చేసుకోవడం కష్టమైన పని కాదు. నేను చదివిన విషయాలన్నింటి ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ పొందడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నా ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించడంలో నా అకడమిక్ నేపథ్యం ఖచ్చితంగా నాకు సహాయపడుతుంది. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని చౌదరి చెప్పారు.