Narendra Modi: జూన్ 8న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం; గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కింగ్ మేకర్స్-narendra modi likely to take oath as prime minister for third time on june 8 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Narendra Modi: జూన్ 8న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం; గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కింగ్ మేకర్స్

Narendra Modi: జూన్ 8న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం; గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కింగ్ మేకర్స్

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 02:30 PM IST

Narendra Modi: నరేంద్ర మోదీ జూన్ 8 న భారత ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్ 8, శనివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

జూన్ 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
జూన్ 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

Narendra Modi oath: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 8న మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జూన్ 5న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 17వ లోక్ సభను రద్దు చేయాలని సిఫారసు చేసింది. 17వ లోక్ సభ కాల పరిమితి జూన్ 16వ తేదీ వరకు ఉంది.

కింగ్ మేకర్స్ గ్రీన్ సిగ్నల్

ఎన్డీయే లో ప్రస్తుతం కింగ్ మేకర్స్ గా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీశ్ కుమార్ లు తాము ఎన్డీయేలోనే కొనసాగుతామని బీజేపీ అగ్ర నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే ఎన్డీయే సమావేశంలో ఈ రెండు పార్టీలు బీజేపీకి అధికారికంగా మద్దతు లేఖలను సమర్పించే అవకాశం ఉంది. దాంతో, మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. జూన్ 8 న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.

2014 తరువాత తొలిసారి..

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ మెజారిటీని దాటలేకపోయినప్పటికీ పొత్తుల సాయంతో ఎన్డీయే కూటమి 292 సీట్లు సాధించింది. విపక్ష ఇండియా కూటమి సంఖ్య 234 గా ఉంది. 2019లో గెలిచిన 303 సీట్లు, 2014లో గెలిచిన 282 స్థానాలతో పోలిస్తే.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలం చాలా తగ్గింది. మరోవైపు, 2019లో 52, 2014లో 44 సీట్లతో పోలిస్తే.. 99 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ బాగా బలపడింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272 మెజారిటీ మార్కుకు 32 స్థానాలు తక్కువ స్థానాలు సంపాదించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.

ఈ రోజు ఎన్డీయే భేటీ

భవిష్యత్ రాజకీయ కార్యాచరణ వ్యూహాలను రూపొందించేందుకు నేడు ఎన్డీయే సమావేశం కానుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే నాయకులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీశ్ కుమార్ లు కూడా పాల్గొంటున్నారు.