Odisha Elections: ఒడిశాలో నవీన్ పట్నాయక్ మారథాన్ కు బ్రేక్ ఎందుకు పడింది?.. బీజేపీ విజయానికి కారణాలేంటి?-odisha elections upset bjp ends naveen patnaiks 24 year rule what went wrong ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Odisha Elections: ఒడిశాలో నవీన్ పట్నాయక్ మారథాన్ కు బ్రేక్ ఎందుకు పడింది?.. బీజేపీ విజయానికి కారణాలేంటి?

Odisha Elections: ఒడిశాలో నవీన్ పట్నాయక్ మారథాన్ కు బ్రేక్ ఎందుకు పడింది?.. బీజేపీ విజయానికి కారణాలేంటి?

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 01:48 PM IST

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ ఘన విజయం సాధించి బీజేడీ సుదీర్ఘ పాలనకు ముగింపు పలికింది. సుదీర్ఘ కాలం రాష్ట్రానికి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ కూడా ఒక స్థానంలో ఓడిపోయారు. రెండు చోట్ల పోటీ చేసిన పట్నాయక్ ఒక స్థానంలో మాత్రమే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 78, బీజేడీకి 51 సీట్లు వచ్చాయి.

ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమికి పలు కారణాలు
ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమికి పలు కారణాలు

Odisha Elections: ఒడిశాలో బీజేడీ నేత నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 78 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 51, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ 78 సీట్లతో విజయం సాధించగా, సీపీఎం 1, ఇండిపెండెంట్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ 113 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒడిశాలోని 21 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 20 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది.

ఒక సీట్లో ఓటమి

2024 అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ హింజిలి, కాంతాబంజి స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ కాంతాబంజి సీట్లో ఓటమి పాలయ్యారు. హింజిలిలో కూడా ఆయన కేవలం 4636 ఓట్ల తేడాతో గెలవడం గమనార్హం. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించాయి. అంతకు ముందు 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేడీ 20, బీజేపీ 1, కాంగ్రెస్ 0 సీట్లు గెలుచుకున్నాయి.

బీజేపీ తొలి ప్రభుత్వం

ఒడిశా రాజకీయ చరిత్రలో ఇదే తొలి బీజేపీ ప్రభుత్వం. 2000 నుంచి 2009 వరకు బీజేపీ బీజేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ కూటమి కూలిపోయింది. బీజేడీకి వ్యతిరేకంగా బీజేపీ 2024 వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 2024 ఎన్నికలకు ముందు కూడా బీజేడీ, బీజేపీల మధ్య సీట్ల పంపకాలకు ప్రయత్నించి విఫలం అయ్యారు.

బీజేపీ దూకుడు ప్రచారం

ఒడిశా ఎన్నికల్లో బీజేపీ విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది పార్టీ అగ్రనేతల ప్రచారం. ఒడిశాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అగ్రనేతలు ఒడిశా నలుమూలలా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ స్వయంగా రెండు రోడ్ షోలు నిర్వహించడంతో పాటు 10 ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీ కేంద్ర నేతలు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 245 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, హేమమాలిని వంటి పార్టీ అగ్రనేతలు ప్రచారం చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగడం కూడా బీజేపీ కి కలిసివచ్చింది.

బీజేడీ ఓటమికి కారణాలు

ఒడిశా ఎన్నికల్లో బీజేపీ ప్రచారంతో పోలిస్తే, బీజేడీ ప్రచారం చాలా బలహీనంగా, చప్పగా సాగింది. బీజేడీ ప్రచారం కేవలం పట్నాయక్, ఆయన సన్నిహితుడు వీకే పాండ్యన్ లకు మాత్రమే పరిమితమైంది. పట్నాయక్ కూడా పరిమిత సంఖ్యలోనే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. పూరీలోని జగన్నాథుని రత్న భండార్ (ట్రెజరీ) తాళం చెవి మిస్ కావడంపై బీజేపీ బీజేడీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వాన్ని, పార్టీని ఔట్ సోర్సింగ్ చేస్తున్నారని పట్నాయక్ పై ఆరోపణలు చేసింది.

పాండ్యన్ ఎఫెక్ట్

మరోవైపు, తమిళుడైన పాండ్యన్ కు పట్నాయక్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని బీజేపీ నేతలు తమ ప్రచారంలో ప్రశ్నించారు. అలాగే, పట్నాయక్ అనారోగ్యాన్ని కూడా బీజేపీ ఒక ప్రచారాంశంగా చేసుకుంది. అందుకు పాండ్యన్ యే కారణమనే అనుమానాన్ని ఓటర్లలో రేకెత్తించింది. దీనికితోడు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రజలతో మాట్లాడేందుకు మైక్ కూతా ఎత్తలేకపోవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయింది. పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక కుట్ర ఉండొచ్చని బీజేపీ ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని మోదీ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Whats_app_banner