Odisha Assembly election results 2024 : ఒడిశా రాజకీయాల్లో పెను సంచలనం! 2000 నుంచి అధికారంలో కొనసాగుతున్న బిజూ జనతాదళ్‌కు అక్కడి ప్రజలు గుడ్‌బై చెప్పినట్టు కనిపిస్తోంది. అధికార బీజేడీకి షాక్ ఇస్తూ.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అతి చేరువలో ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. మొత్తం 147 సీట్లకు పోలింగ్ జరగ్గా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. అధికార బీజేడీ ఇక్కడ కేవలం 48 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 13 చోట్ల లీడ్‌లో ఉంది. ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కానీ.. బీజేడీకి షాక్ ఇస్తూ.. ఒడిశాలో బీజేపీ 81 స్థానాల్లో దూసుకెళుతోంది. మెజారిటీ మార్క్ 74 కన్నా ఇది ఎక్కువే. ఇదే ట్రెండ్ కొనసాగితే.. 2000 తర్వాత.. ఒడిశాలో తొలిసారిగా బీజేడీయేతర పార్టీ అధికారంలోకి వస్తుంది.
Odisha Assembly election results BJD : ఇండియాలో సుదీర్ఘకాలంపాటు సీఎంగా పని చేసిన వారి జాబితాల్లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు 77ఏళ్ల నవీన్ పట్నాయక్. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. మొదటి స్థానంలో నిలిచేవారు. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఎన్డీఏలో లేకపోయినా.. నవీన్ పట్నాయక్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంచి మైత్రి ఉంది. కేంద్రంలో మోదీకి నవీన్ పట్నాయక్ పరోక్షంగా మద్దతిస్తూ ఉండేవారు. అలాంటిది.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు కనిపించాయి. ఎన్నికలకు ముందు నవీన్ పట్నాయక్‌పై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అది.. ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రధాని మోదీ అనేకమార్లు స్వయంగా పర్యటించారు. నవీన్ పట్నాయక్ వయస్సు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తారు. అది క్లిక్ అయినట్టే కనిపిస్తోంది.
2024 Lok Sabha election results : వాస్తవానికి.. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేడీ బలహీన పడినట్టు కనిపిస్తోంది. నాటి ఎన్నికల్లో 147 సీట్లకు గాను బీజేడీ 112 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 9కే పరిమితమైంది. 2014తో (10) పోల్చుకుంటే అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. 23 స్థానాల్లో గెలిచింది. ఇది.. కమలదళానికి మేజర్ బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు.. నవీన్ పట్నాయక్ టీమ్‌ని వీలు కుదిరినప్పుడల్లా టార్గెట్ చేస్తూ వచ్చింది. చివరికి.. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు చేరువైంది.
ఒడిశాలో అధికారం దిశగా బీజేపీ కదులుతున్నా.. కేంద్రంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనిపించకపోవడం కమలదళాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్డీఏ కూటమి ఈసారి బలమైన ప్రదర్శన చేస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎన్డీఏకి విపక్ష ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఫలితాలకు ముందు.. బీజేపీ సొంతంగా మెజారిటీ దాటిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం