Lok Sabha election results : యూపీలో బీజేపీకి షాక్! 'ఇండియా' నుంచి గట్టి పోటీ.. అంచనాలు తారుమారు!
Lok Sabha election results 2024 : యూపీలో అనూహ్య పరిణామాలు! ఎన్డీఏకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Lok Sabha election results : 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం! బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బలమైన పట్టు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో.. విపక్ష ఇండియా చాలా మెరుదైన ప్రదర్శన చేస్తోంది. అనూహ్యంగా.. బీజేపీకి సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని ఇండియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో తాజా పరిస్థితులు..
లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఉత్తర్ ప్రదేశ్ చాలా కీలకం. దేశంలోనే లోక్‌సభ స్థానాలు అత్యధికంగా ఉండే రాష్ట్ర ఈ యూపీ. ఇక్కడి 80 సీట్లల్లో ఎక్కువ గెలిస్తే.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కాస్త సులభం అవుతుందని అంటూ ఉంటారు. అందుకే యూపీ ఫలితాలు ఎప్పుడూ కీలకంగా ఉంటాయి.
అలాంటి యూపీలో.. ఉదయం 11 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 38 చోట్ల లీడింగ్‌లో ఉంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎస్పీ నేతృత్వంలోని ఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక చోట లీడ్ చేస్తున్నారు.
Lok Sabha election results UP : ఇది ఇండియా కూటమి శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. కాగా.. బీజేపీకి మాత్రం షాక్ తగిలినట్టు అయ్యింది.
హిందూ అజెండాతో ఈ ప్రాంతంలో అధిపత్యాన్ని కొనసాగించేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలే చేసింది. మరీ ముఖ్యంగా.. రామమందిర ప్రారంభోత్సవాన్ని ఎన్నికల అజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లింది. కానీ.. 2019తో పోల్చుకుంటే.. ఇప్పుడు యూపీలో బీజేపీకి సీట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా.. వారణాసిలో ప్రధాని మోదీ తొలుత వెనకంజలో ఉండటం అందరిని షాక్‌కు గురిచేసింది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్.. ఒకానొక దశలో మోదీ కన్నా దాదాపు 6వేల ఓట్ల తేడాతో ముందంజలో నిలిచారు. కానీ మూడు, నాలుగో రౌండ్ వచ్చేసరికి.. ప్రధాని మోదీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుని బలమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
2024 Lok Sabha election results : ఇక ఇదే యూపీలోని అమేఠీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2019లో అమేఠీలో రాహుల్ గాంధీపై విజయం సాధించి సంచలనం సృష్టించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం వెనకంజలో ఉన్నారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్.. దాదాపు 29,400 ఓట్ల మెజారిటీతో ముందు ఉన్నారు.
ఇక ఇదే యూపీలో.. తల్లి సోనియా గాంధీ సీటు అయిన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ.. భారీ మెజారిటీతో దూసుకెళుతున్నారు.
ఇతర కీలక రాష్ట్రాల్లో పరిస్థితులు..
Lok Sabha election results latest news : ఇక మరో కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ఎన్డీఏకి ఇండియా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక్కడి 48 సీట్లల్లో విపక్ష ఇండియా 26 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏకి 19 చోట్ల విజయం దక్కేలా కనిపిస్తోంది. ఇతరులు 3 చోట్ల లీడ్‌లో ఉన్నారు.
పశ్చిమ్ బెంగాల్‌పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది! 2019 ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న కమలదళం.. ప్రస్తుతం 9 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. 42 సీట్లున్న బెంగాల్లో టీఎంసీ 30 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది.
సంబంధిత కథనం