ఒడిశాలో ‘అస్మిత’ మంత్రం ఫలించేనా..? తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?-odisha elections 2024 who will take the lead ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  ఒడిశాలో ‘అస్మిత’ మంత్రం ఫలించేనా..? తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

ఒడిశాలో ‘అస్మిత’ మంత్రం ఫలించేనా..? తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

HT Telugu Desk HT Telugu
May 31, 2024 06:29 PM IST

Odisha Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈసారి త్రిముఖ పోటీ వల్ల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీనిపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీ కృష్ణ శర్మ విశ్లేషణ.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (HT_PRINT)

సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రసిద్ధిగాంచిన ఒడిశాలో లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు త్రిముఖ పోటీతో ఆసక్తికరంగా మారాయి. 24 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్‌కు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల నుండి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ప్రధానంగా ఎన్నికల ముందు వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మిత్రపక్షంగా కొనసాగిన బీజేడీ, బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా మారాయి. నవీన్‌ పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ ‘అస్మిత’ (ఆత్మగౌరవం) నినాదాన్ని ఎత్తుకోవడంతో ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రజా సమస్యలు వెనక్కిపోయి సెంటిమెంట్‌ ముందుకొచ్చింది.

రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ మధ్య పొత్తు కుదురుతుందని ఎన్నికల ముందు వరకు ప్రచారం సాగింది. 2014 నుండి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్ని అంశాల్లో సహకరిస్తూ పలు కేంద్ర ప్రభుత్వ బిల్లులకు మద్దతిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ వీరి మిత్రత్వం పదేళ్లు సాగింది. 

2009 వరకు మిత్రపక్షంగా కొనసాగిన బీజేపీ, బీజేడీలు 2009, 2014, 2019 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ లక్ష్యం పెట్టుకున్న నరేంద్ర మోదీ ఒడిశాలో బీజేడీతో పొత్తు పెట్టుకోవడానికే ఆసక్తి చూపించినా రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు రావడంతో ఎవరికి వారే బరిలోకి దిగారు.

నవీన్‌ పట్నాయక్‌ పార్టీలో తన వారసుడిగా తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌ అధికారి కార్తికేయ పాండ్యన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుత ఎన్నికలు పాండ్యన్‌ చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన బీజేడీలో కోటి మంది పార్టీ సభ్యత్వాలు కలిగున్నా నవీన్‌ పట్నాయక్‌ తన వారసుడిగా మరో నేతను తయారు చేయలేకపోయారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్ర వ్యవహారాల్లో ప్రధాన అనుచరుడిగా ఉన్న పాండ్యన్‌ వీఆర్‌ఎస్‌ తీసుకొని ‘ఒడిశా 2036 విజన్‌’ లక్ష్యంగా బీజేడీలో చేరారు. పాండ్యన్‌ పార్టీలో అన్నీతానై పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీన్ని అస్త్రంగా మల్చుకున్న బీజేపీ నవీన్‌ పట్నాయక్‌ రాష్ట్ర భవిష్యత్‌ను ఒడియేతరుల చేతిలో పెట్టి ఒడిశా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారంటూ పాండ్యన్‌ను లక్ష్యంగా చేసుకొని ‘అస్మిత’ను ఎన్నికల్లో కీలకాంశంగా మార్చింది.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ధాన్యం సేకరణలో ప్రభుత్వ వైఫల్యం, పంటలకు మద్దతు ధర లభించకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వైద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం వెనుకబడింది.

వ్యక్తిగతంగా నవీన్‌ పట్నాయక్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నా మంత్రులు, పార్టీ అనుచరులపై చిట్‌ఫండ్‌ స్కాం, మైనింగ్‌ స్కాం, పలు ప్రభుత్వ పథకాల్లో అవినీతి, రిక్రూట్‌మెంట్లలో స్కాం ఆరోపణలున్నాయి. వీటితో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నవీన్‌ పట్నాయక్‌పై బీజేపీ ‘అస్మిత’ అస్త్రాన్ని ప్రయోగించడంతో బీజేడీ కూడా ఇదే సెంటిమెంట్‌తో లబ్ది పొందాలని చూస్తోంది.

రాష్ట్రంలో ప్రజాదరణ గల నవీన్‌ పట్నాయక్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకోవడాన్ని బీజేడీ అనుకూలంగా మల్చుకుంటోంది. ఆయన ఆరోగ్యంపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీ పరోక్షంగా పాండ్యన్‌ను టార్గెట్‌ చేసుకుంది. ఒక సభలో నవీన్‌ పట్నాయక్‌ చేయి వణకడం, పాండ్యన్‌ దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్టు ఉన్న వీడియోన్ని వైరల్‌ చేస్తూ అనార్యోగం, వృద్ధాప్యం కారణంగా నవీన్‌ పట్నాయక్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారు.

దీనిపై స్పందించిన నవీన్‌ పట్నాయక్‌ బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, దేశంలోని బీజేపీ యేతర నాయకులను వేధిస్తున్న ఆ పార్టీ ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుందని ప్రతివిమర్శ చేశారు. నవీన్‌ పట్నాయక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా విమర్శించడాన్ని బీజేడీ ఆయన వ్యక్తిగత ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నట్టు ప్రచారం చేస్తుంది.

రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రస్తావిస్తున్న బీజేపీ ఒడిశాలో చారిత్రాత్మకమైన పూరి జగన్నాథ ఆలయం కంటే అయోధ్య రామాలయం గురించే అధికంగా మాట్లాడుతుందని బీజేడీ ప్రచారం చేస్తోంది. మరోవైపు 2014 నుండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పలు రకాలుగా సహకరిస్తుందని నవీన్‌ పట్నాయక్‌ గతంలో పలు సందర్భాలో చెప్పడంతో ఇప్పుడు ఆయన బీజేపీని విమర్శించడానికి ప్రధాన అస్త్రం కోల్పోయినట్టయ్యింది. నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యంపై పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆయనతో వ్యక్తిగతంగా తమకు ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్రేతరులకు ప్రాధాన్యతివ్వడమే ప్రధాన సమస్యని చెబుతుండడంతో బీజేపీ కేడర్‌ గందరగోళానికి గురవుతోంది.

సమస్యలపై చర్చ కనుమరుగు

బీజేపీ ‘అస్మిత’ ప్రచారంతో ప్రధాన సమస్యలన్నీ పక్కదారిపడి తమకు మేలు జరిగిందని ఆశిస్తున్న బీజేడీ ఆరోసారి నవీన్‌ పట్నాయక్‌ సీఎంగా బాధ్యతలు చేపడుతారనే విశ్వాసంతో ఉంది. అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమ కోసం చేపట్టిన సెల్ఫ్‌ హెల్ఫ్‌ గ్రూప్‌ (ఎస్‌హెచ్‌జీ)తో 70 లక్షల మందికి పైగా మహిళలు ప్రయోజనం పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహిళలు బీజేడీకి వెన్నెముకగా ఉన్నారు. వీరిపై ‘అస్మిత’ నినాదం ప్రభావం ఉండే అవకాశాలు తక్కువే. రాష్ట్రంలో పలు స్థానాల్లో రెబెల్స్‌ అభ్యర్థులు బరిలో దిగడం బీజేడీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.

ఒడిశా ఆత్మగౌరవం ‘అస్మిత’ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ రాష్ట్ర పగ్గాలతో పాటు అధికంగా ఇక్కడ ఎంపీ స్థానాలు గెలుస్తామనే విశ్వాసంతో ఉంది. జూన్‌ 10వ తేదీన రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థి సీఎం పదవి బాధ్యతలు చేపడుతారని నరేంద్ర మోదీ చెప్పగా, ఒడిశాలో 17 ఎంపీలు, 75 ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తామని అమిత్‌షా ప్రకటించారు. 

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెనక్కునెట్టి రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కదిపినా లోగడ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేక భంగపాటుకు గురైంది. సంస్థాగతంగా బలహీనంగా ఉన్న బీజేపీ మోదీ చరిష్మా పైనే ఆధారపడిరది. బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా రాష్ట్ర పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లోగడ రాష్ట్రంలో పలుమార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ 2000లో నవీన్‌ పట్నాయక్‌ ప్రవేశంతో అధికారానికి దూరమైంది. 2014 ఎన్నికల వరకు రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ 2019లో మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ, బీజేడీ పార్టీల మధ్య పొత్తు ఉంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతతో ప్రధాన ప్రతిపక్షంగా తాము లాభపడి పూర్వవైభవం పొందాలని ఆశించిన కాంగ్రెస్‌ ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండడంతో నిరుత్సాహ పడింది.

12 ఎంపీలు, 90 ఎమ్మెల్యేల సీట్లు సాధిస్తామని ఎన్నికల ముందు వరకు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌ ప్రస్తుతం బలహీన పడింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో లేకపోయినా పార్టీలో అంతర్గత విభేదాలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం బీజేడీ బీజేపీ మధ్య పోరుతో మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

జనగనమణలో ఉన్న ‘ఉత్కల’ పేరుతో కూడా పిలువబడే ఒడిశాలో 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో నాలుగు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు దశలు ముగించుకొని తుది దశ జూన్‌ 1వ తేదీన జరగనున్న నేపథ్యంలో ‘అస్మిత’ నినాదం బీజేపీకి లాభిస్తుందో లేదా గురితప్పి బీజేడీకే ప్రయోజనం చేకూరుస్తుందో జూన్‌ 4న వెలువడే ఫలితాలు తేల్చనున్నాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, వ్యూహాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

WhatsApp channel