Nitish Kumar : అనుకున్నదే జరిగింది.. బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా!
Nitish Kumar resigns as Bihar CM : బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. త్వరలోనే ఎన్డీఏలో కలవనున్నారు.

Nitish Kumar resigns as Bihar CM : దేశ రాజకీయాల్లో మరో కీలక మలుపు! 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. బిహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. ఆదివారం ఉదయం.. పట్నాలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వద్దకు వెళ్లి.. తన రాజీనామాను సమర్పించారు. ఫలితంగా.. ఆ రాష్ట్రంలో జేడీయూ- ఆర్జేడీ మధ్య 2022లో ఏర్పడిన మహాఘట్బంధన్ ప్రభుత్వానికి ముగింపు పడింది. నితీశ్ కుమార్.. మరికొన్ని గంటల్లో ఎన్డీఏలో చేరి బీజేపీతో కలిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
దశాబ్ద కాలంలో ఐదోసారి..!
నితీశ్ కుమార్.. ఇలా ప్రభుత్వాన్ని పడగొట్టి, వేరే కూటమిలో చేరడం దశాబ్ద కాలంలో ఇది 5వసారి! గత బిహార్ ఎన్నికల తర్వాత.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ కమలదళంతో విభేదాల కారణంగా 2022లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.. విపక్ష ఆర్జేడీతో చేతులు కలిపారు. మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, సీఎం అయ్యారు.
Bihar politics latest news : 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు పావులు కదిపాయి. 'ఇండియా' పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. అందులో కీలక నేతల్లో ఒకరు నితీశ్ కుమార్. ఇంకా చెప్పాలంటే.. కూటమి ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర అని రాజకీయ నిపుణులు అంటూ ఉంటారు. అలాంటిది.. ఇటీవలి కాలంలో కూటమితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయని ఊహాగానాలు జోరుగా సాగాయి. ఇండియా కూటమికి తాను కన్వీనర్‌గా అవ్వాలని ఆయన భావించారు. అదే జరిగి ఉంటే.. ఎన్నికల్లో గెలిస్తే.. ప్రధాని కూడా అయ్యే అవకాశం ఉండేది. కానీ అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా.. కాంగ్రెస్‌పై అంసతృప్తి కారణంగా.. కూటమి నుంచి తప్పుకోవాలని నితీశ్ కుమార్ భావించారట.
'అందుకే రాజీనామా చేశా..'
Nitish Kumar latest news : ఈ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం బిహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు నితీశ్ కుమార్.
"సీఎం పదవికి రాజీనామా చేసి, ఈ ప్రభుత్వాన్ని ముగించాను. నాకు అన్ని వైపుల నుంచి సూచనలు వస్తున్నాయి. గతంలో ఓ కూటమితో తెగదెంపులు చేసుకుని, ఇందులోకి వచ్చాను. కానీ ఇక్కడా పరిస్థితులు బాగాలేవు. అందుకే రాజీనామా చేశాను. మంత్రులు కలుస్తాము. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాము," అని.. రాజీనామా అనంతరం మాట్లాడారు నితీశ్ కుమార్.
Bihar Political crisis : "నేను కుటమి కోసం పనిచేశాను. కూటమి ఏర్పడేలా చర్యలు తీసుకున్నాను. కానీ ఎవరు ఏ పని చేయడం లేదు," అని విపక్ష ఇండియాపై పరోక్షంగా విమర్శలు చేశారు నితీశ్ కుమార్.
ఒకప్పుడు.. అద్భుత పాలనతో మంచి పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్.. ఇప్పుడు ప్రభుత్వాలను కూలగొట్టి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూటములు మరుతూ.. వార్తల్లో నిలుస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం